నాటక రచన, వివిధ దశలు
1588 మొదలు 1612 వరకు సాగించిన 24 సంవత్సరాల సాహితీజీవితంలో షేక్స్పియర్ 37 నాటకాలు, రెండు మహాకావ్యాలు, కొన్ని ఖండకావ్యాలు రచించాడు. షేక్స్పియర్ నాటక రచనాకాలాన్ని విమర్శకులు నాలుగు దశలుగా విభజించారు.
ప్రథమదశ (1588-1595): ఈ దశ నాటకాల్లో చరిత్రాత్మకాలు, విషాదాంత, సుఖాంతాలు. వీటిలో ప్రసిద్ధమైనవి హెన్రీ VI మూడుభాగాలు, మూడవ రిచర్డ్, రెండవ రిచర్డ్, రోమియో జూలియట్, వేసవినాటి రాత్రికల మొదలైనవి. వీటిలో భాషాపటిమే గాని భావగాంభీర్యం తక్కువ.
ద్వితీయదశ (1595 - 1601): ఈ దశలో షేక్స్పియర్ కొన్ని సుప్రసిద్ధ సుఖాంతనాటకాలు, చరిత్రాత్మక నాటకాలు రచించాడు. వెనిస్ వర్తకుడు, జాన్ రాజు, నాల్గవ హెన్రీ రెండుభాగాలు, ఐదవ హెన్రీ ఈ కాలంనాటివి. ఈ దశలోని నాటక రచనాకాలం నాటికి షేక్స్పియర్ మహాకవి మనస్సు పరిపక్వం కావటం ప్రారంభించింది. వీటిలో ప్రపంచానుభవం, మనస్తత్త్వ పరిశీలనం, గత నాటకాలలో కన్నా ఎక్కువ.
తృతీయదశ (1601-1608): ఈ దశలో జన్మించినవే జూలియస్ సీజర్, ఆంటోనీ క్లియోపాత్రా, కోరియలాసస్ అనే మూడు రోమేశ చరిత్రాత్మక నాటకాలు. హామ్లెట్, ఒథెల్లో, లియర్, మాక్బెత్ - అనే విషాదాంత చతుష్టయం కూడా యీ దశలోనివే. ట్రాయిలస్ - క్రెసిడా వంటి సుఖాంత నాటకాలు కొన్ని ఉన్నప్పటికీ విమర్శకులు ఈ దశను 'విషాదాంత దశ' గానే పేర్కొన్నారు. ఈ దశలో మహాకవి షేక్స్పియర్ విలాసం, ప్రణయం, యుద్ధవైభవాదులమీదకు పోయే బుద్ధిని మానవ హృదయకుహరాంతరాలకు మళ్ళించి, అంధకారం ఆవరించిన అక్కడి మానవ దౌష్ట్య స్వరూప స్వభావాదులను దర్శించి అవకర్షణ చేసి ప్రదర్శించాడు.
చతుర్థదశ (1608 - 1611): తుది దశ. ఇది ఒక నవచైతన్య దశ. శీతకాల కథ, సింబలైన్, తుపాను, పెరికిల్స్ ఈ దశలో పుట్టిన రూపకాలు. ఈ నాటకాల్లో ప్రశాంతచిత్తం, సుఖదుఃఖాదుల యెడ సమబుద్ధి ప్రకటితాలౌతుంటవి. దీన్ని విమర్శకులు షేక్స్పియర్ పరిపక్వదశగా భావిస్తుంటారు. 12 వావిలాల సోమయాజులు సాహిత్యం-3