భూమిక
కవి జీవితవిశేషాలు
'ప్రపంచాగ్రగణ్యుడైన నాటకకర్త' అని ఖ్యాతివహించిన విలియం షేక్స్పియర్ క్రీ.శ. 1564 ఏప్రిల్ మాసంలో ఆంగ్లదేశంలోని స్ట్రాఫర్డ్ - ఆన్ - ఆవన్ అనే నగరంలో జన్మించాడు. తన పదునాల్గో సంవత్సరం దాకా స్వల్పంగా విద్యాగ్రహణం చేసి, తండ్రి జాన్ షేక్స్పియర్కు వ్యాపారంలో తోడ్పడటానికని విద్యార్జనకు స్వస్తి చెప్పాడు. పదునెనిమిదవ ఏట తనకంటే ఏడు సంవత్సరాలు పెద్దదైన ఆనీహాథ్ వే అనే కన్యను వివాహమాడాడు.
యౌవనారంభదశలో సర్ జాన్ లూసీ అనే ధనికునితో పేచీ, వైవాహిక జీవిత వైఫల్యం షేక్స్పియర్ను జన్మసీమకు దూరం చేశాయి. క్రీ.శ. 1584లో అలా అతడు లండన్ మహానగరం చేరుకున్నాడు. 'గ్లోబ్' నాటకశాలలో మొదట 'అశ్వబాలుడు', 'ఆమంత్రణ - బాలుడు' ఉద్యోగాలు చేసి, క్రమంగా ఆ నాటకశాలలోనే నటకుడు, నాటకరచయితగా పదోన్నతి పొందాడు. ప్రారంభదశల్లో అతడు ఇతరుల నాటకాలను ప్రదర్శనీయంగా మలిచాడు. కాలక్రమాన అనుభవాన్ని స్వీయ నాటకరచన ద్వారా సమకాలీన నాటకకర్తల్లో అగ్రగణ్యుడనిపించుకున్నాడు. తన 24 సంవత్సరాల సాహితీ జీవితంలో 37 నాటకాలు రచించాడు. నటకుడుగా షేక్స్పియర్ ప్రజ్ఞావిశేషాలు ఏ స్థాయిని తాకినవో తెలియరాలేదు.
ఆత్మశక్తివల్ల నిత్యాభివృద్ధి పొందుతూ ప్రసిద్ధుడై ధనార్జనం చేసి, ప్రభువర్గంలో చేరి ఎసెక్సు, సౌతాంప్టన్ ఎరల్స్, పెంబ్రోక్ ప్రభువులతో మైత్రి సంపాదించి వారికి సరివాడనిపించాడు. ఎలిజిబెత్ రాణి, జాన్ రాజు ఆయన నాటకాలపై ఆసక్తులై బిరుదులతో గౌరవించారు. లౌకిక జీవితంలో కూడా విజయాలను సాధించి లోకజ్ఞుడనిపించుకొన్న షేక్స్పియర్, జీవిత చరమాంకంలో తన సంపదతో జన్మప్రాంతమైన స్ట్రాఫర్డ్ కు వచ్చి ప్రశాంత జీవితాన్ని గడిపి, 23 ఏప్రిల్ 1616 తేదీన తనువు చాలించాడు. జూలియస్ సీజర్ 11