నలగామ: 'ప్రభూ!' ప్రభు నెవరన్నా? మలిదేవుడు ప్రభువు. బ్రహ్మన్న మంత్రి మహా మంత్రి. రాజ్యానికి నాకు అర్హత ఉన్నదో లేదో. నేను దాని నాశించను. పరిత్యజిస్తున్నాను.
అన్నా! కన్నమతో నేను అతనిని కలకాలం జీవించమని దీవించునట్లు చెప్పండి. మలిదేవా! (దగ్గరికి వస్తే) తమ్ముడూ! నా ద్రోహాలన్నీ మరిచిపో! అన్న ఆజ్ఞాపించినట్లు రాజ్యపాలన చేసి మన తండ్రి తాతల పేరు నిలవబెట్టు. నీ రాజ్యం రామరాజ్య మనిపించు. నేను తపోవనాలల్లో ప్రశాంతి నాశిస్తున్నాను.
మలిదేవుడు: (ఆశ్చర్యంతో, ప్రేమపూర్వకంగా) అన్నా! ఈ దారుణ మేమిటి?
లేడిత డేగినాడు సుఖలీలకునై సురలోక భూమికిన్
నీడగ నిల్వ కిట్లు అవనీభర మెల్ల వహింపు మంచు క్రొ
వ్వాడి తపంబొనర్ప చన పాడియె మీరలు లేకయున్న నా
పోడిమి చెల్లు నేగతిగ భూప్రజపాలన చేయనేర్తునో.
నలగామ: (ఉదాత్తముఖ విన్యాసంతో) తండ్రీ!
లేరని వారు వీరు మదిలేశము చింతయొనర్ప కయ్య నీ
వారిల నున్నవారు కన వాస్తవ బుద్ధి కసత్యమేను నీ
వీ రణభూమి మంటి మను టేనియు, సర్వము మిధ్య దేహి ఇ
ట్లూరక భ్రాంతి నొందు సమయోచిత మోహరస ప్రలుబ్దతన్
(బ్రహ్మన్నతో) అన్నా నాకు సెలవు. (కొమ్మరాజుతో) బావా! అనుజ్ఞ!!!
బ్రహ్మన్న: నన్ను గూడా తపోవనాలకు నిన్ననుసరించనీ నాయనా!
నలగామ: గురిజాలలో మలిదేవుడికి పట్టాభిషేకం చేయించి అతడు సుఖంగా రాజ్యపాలనం చేస్తున్న తరువాత మీరు వనాలకు రావచ్చును. ఇది నా ఆజ్ఞ. ఇప్పుడు నేను ప్రభువును.
(ఠీవితో నిష్క్రమిస్తాడు)
బ్రహ్మన్న: ప్రభూ!
(తెరలో కత్తుల కణకణలూ, సింహనాదాలు వినిపిస్తవి)
నాగమ్మ గొంతు: (పౌరుషోద్రేకంతో)
——————————————————————————————
99