ఓరీ కన్నమ! పొంగెదింతటికె ఓహో, జోదువైనావె, ఈ
పోరాటమ్మున గెల్వలేవు ఆడిదంబున్ పట్టుటేలాగొ నీ
కేరా వచ్చునె? త్రిప్పుకొమ్మిదిగా ఏదీ? పారిపొమ్మింక లే
దా రక్తాంజలి నిల్పి నీ శరముతో నర్చింతు కాత్యాయనిన్
కన్నమదాసు గొంతు: (ప్రళయ భీకరంగా)
ఓసి పిశాచి, ప్రేలకిక ఊరక మాటలతోడ ఖడ్గవి
న్యాసము చేసెదేల? కదనంబున నిన్ హతమార్పలేక కా
దే సమయింతు తండ్రి కడ ఈ కరవాలము నాపలేక ఆ
యాసమె కల్గుచున్న దెటు లైనను నీ బ్రతుకింక చెల్లెనే.
ఈ ఢాక అందుకో!
నాగమ్మ: (ప్రవేశిస్తూ) ఇదిగో ఎదురుదెబ్బ - నాతోనా నీకు తులువా?
కన్నమ: (కత్తిమీద దెబ్బకొడుతూ ప్రవేశించి) నడు. (గట్టిగా దెబ్బ కొడితే నాగమ్మ చేతిలో కత్తి కింది పడుతుంది. కన్నమ నాగమ్మ డొక్కకు కత్తి మోటించి నొక్కుతూ బ్రహ్మన్న పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు)
నాగమ్మ: (బాధతో) అబ్బా!
బ్రహ్మన్న: (బాధించటము మానమనే అభిప్రాయంతో) కన్నమా!
కన్నమ: తండ్రీ! ఈ పిశాచి కనికరించ దగ్గది కాదు.
బ్రహ్మన్న: మహా మేధావి! అనుపమ ప్రజ్ఞావంతురాలు!! (కన్నమ కడుపులోకి కత్తి నొక్కుతాడు. రక్తము చిమ్మికొడుతుంది)
నాగమ్మ: (బ్రహ్మనాయుని పాదాల దగ్గిరకు వ్రాలి పొర్లాడుతూ) అబ్బా! క్షమించు బ్రహ్మన్న మంత్రీ! అపకారాలు ఎన్నో చేశాను... క్షమించు... అయ్యో..... రక్తం.... దాహం... నా తండ్రికి... మృత్యు... దండన.... జ్ఞప్తికుందా... (సోలి ప్రాణం విడుస్తూ) ఇది, ఇది ప్రతీ.... కా.... ర... ము. _____________________________________________________________
వావిలాల సోమయాజులు సాహిత్యం-2