Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(నరసింహుడు కాదు, నరసింహుడు కాదు. తిరగండి. పట్టుకోండి. జై చెన్నకేశవా, జై చెన్నకేశవా అని కేకలు వినిపిస్తవి)

బ్రహ్మన్న : బావా! ఎవరా పారిపోయేది?

కొమ్మరాజు : నరసింగరాజు

బ్రహ్మన్న : నరసింగరాజా!

కొమ్మరాజు : బాలుడు అతనితో ద్వంద్వ యుద్ధానికి తల పడ్డాడు.

బాలచంద్రుని గొంతుక : ఏం నరసింహా వెనుదీస్తున్నావు?

నరసింహరాజు గొంతుక : ఆదిగొని నీ ప్రాణాలు హరించటానికి

బాలచంద్రుని గొంతుక : అబ్బా! (భీకర కంఠంతో)


ఆడునె చేయి యుద్ధములు ఆడిన దయ్యలరాజు చంప ని
నాన్నడగ జేయ నయ్యతివ నాగమ సిగ్గు శరంబు మాని నీ
వాడెడు కీలు బొమ్మవిటు లాహవ భూమిని నిల్వనేల పో
రాడగ వేశ్య లిండ్లను సరాగములాడగ పొమ్ము ధీరుడా!


ఇదుగో ఈ తోరహత్తాన్ని తప్పుకో.

(ఆయుధముల కణకణలు వినిపిస్తవి)

కొమ్మరాజు : (ఆనందంతో) బలే, బాలుడు తోరహత్తాన్ని కొట్టాడు మహామంత్రీ !

బ్రహ్మన్న : నరసింహుడు ధట్టనతో తప్పుకుంటున్నాడు.

కొమ్మరాజు : అయ్యో! బల్లెం డొక్కకు మోటించాడు, త్రిప్పు, నొక్కు, లొంగిపోతాడు.

నరసింహుడి గొంతుక : వెనుకడుగా, ఈ దెబ్బతో సబ్బాయి గుబ్బలమీద పడతావు. బొంగరాలాటట్రా?

బాలచంద్రుడి గొంతుక : ఆటే. నీ తలే బొంగరం. కాచుకో.

నరసింహరాజు గొంతుక : హాఁ (మరణ సూచక ధ్వనిగా వినిపిస్తుంది)

బ్రహ్మన్న : బాలుడూ అక్రమం, అన్యాయం, అధర్మం.


86

వావిలాల సోమయాజులు సాహిత్యం-2