Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదో దృశ్యం


(కారెంపూడి యుద్ధభూమి బ్రహ్మనాయుడూ కొమ్మరాజూ తమ శిబిరాలముందున్న ఉన్నత ప్రదేశం మీద నిలవబడి యుద్ధరంగాన్ని పరిశీలిస్తూ ఉంటారు)

బ్రహ్మన్న : బావా! ఆ గుర్రపుదళం ఎలా దూకుతూ వెడుతున్నదో చూస్తున్నారా?

కొమ్మరాజు : ప్రళయ కాలంలో సముద్రపు కెరటాలల్లే కేరింతలు కొడుతున్నది.

బ్రహ్మన్న : కాల్బలంలో ఒక్కొక్క శ్రేణికి ఒక విధమైన దుస్తులతో చూడటానికి ఎంతో ఇంపుగా యుద్ధదేవత మగ్గాలశాలలా ఉన్నది కదూ?

కొమ్మరాజు : ఉభయ సైన్యాల మధ్యా నాగులేరు నాగమ్మ బుద్ధిలా కుటిలంగా ఎలా ప్రవహిస్తున్నదో గమనించారా? ..... ఏమిటా కోలాహలం? బాలుడు రంగ మధ్యంలో ప్రవేశించాడు.

బ్రహ్మన్న : (సంతోషంగా) ఎప్పుడూ బొంగరాలాడుకునే వాడు వీడు ఇంతగా యుద్ధం చేయటం ఎప్పుడు నేర్చుకున్నాడయ్యా?

కొమ్మరాజు : (సాభిప్రాయంగా) సింహపు పిల్లకు వేటాడటం ఎవరు నేర్పితే వచ్చిందంటారు?

బ్రహ్మన్న : (వినిపించుకోనట్లుగా) బావా! అటుచూడండి రెప్పపాటులో మెరపు మెరసినట్లుగా దక్షిణ మండల ప్రచారం చేశాడు. అవతల వీరుడూ, ఎవరో గట్టివాడు సవ్యప్రచారం చేసి తప్పించుకున్నాడు.

కొమ్మరాజు : చంద్రుడి యుద్ధ ప్రారంభం రణగండ్లలో తమ వీరవిహారాన్ని జ్ఞప్తికి తెస్తున్నది.

బ్రహ్మన్న : శత్రుపక్షంలో వీరులు బాలుడి ధాటికి ఆగలేక పారిపోతున్నారు... బావా! ఎందుకో ఇప్పుడు బాలుడు చేసే యుద్ధం నేను చేస్తున్నట్లున్నది.

కొమ్మరాజు : బాలుడు సరిగా మీ యౌవనరూపమే. అచ్చుగుద్దినట్లుంటాడు.


84

వావిలాల సోమయాజులు సాహిత్యం-2