శ్రీ జయదేవ కవి విరచిత
పీయూషలహరి
పీఠిక
శ్రీ వావిలాల సోమయాజులు
గీతగోవిందం
ఆంధ్రులకు అష్టపదులంటే అపరిమితమైన అభిమానం. బహుకాలం నుంచీ సంగీత విద్వాంసులు గాన విద్యాప్రావీణ్యానికి 'గీతగోవింద' గాన సామర్థ్యాన్ని ఒక ఒరపిడి రాయిగా నిర్ణయించి ఉండటం గమనించ దగ్గ విషయం.
అష్టపదులకు ఏతత్కృతికర్త ఉంచిన నామం గీతగోవిందం. గోవిందుని గురించిన గీతాలుగల ప్రబంధం కాబట్టి దానికీ పేరు ఉచితమని భావించి ఉండవచ్చును. అష్టపదులంటే అంత ఆదరాభిమానాలను ప్రకటిస్తున్నా ఆంధ్రులు తద్రచయిత జయదేవుని గురించి విశేషంగా తెలుసుకున్నట్లు కనిపించదు.
జయదేవుడు
మహాకవి జయదేవుడు అద్వితీయ మహాభక్తుడుగా పరిగణితుడైనాడు. భక్త చరిత్రల వల్ల ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నవి. క్రీ.శ. 15వ శతాబ్దంలో చంద్రదత్తుడు కూర్చిన 'భక్తమాల'లో జయదేవుని జీవితం కొన్ని సర్గలలో (36-47) వర్ణితమైనది. ఆయనను గురించిన కొన్ని జనశ్రుతులు కూడా దేశంలో ప్రచారంలో ఉన్నవి.
జయదేవుని బాల్యదశను గురించిన విశేషా లేమీ తెలియటంలేదు. విద్యార్థిదశలో గురువుల యొద్ద పక్షం మార్చి మరొక పక్షం విద్యాభాసం[1] చేయటం వల్ల జయదేవుడికి వక్షధరమిశ్రుడనే పేరువచ్చిందని కొందరంటారు. కాని యీ బిరుదం గీతగోవిందకారునిది కాదనీ, ప్రసన్న రాఘవకర్త అయిన మరొక జయదేవుడిదనీ
తెలుస్తున్నది. గీతగోవిందంలో జయదేవుడు "పద్మావతీ చరణచారణ చక్రవర్తి" నని
- ↑ 1ప్రతిభ-జనవరి 1938- 'జయదేవుడు' - రాయప్రోలు సుబ్రహ్మణ్యము పే. 209.
పీయూషలహరి
515