పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.

సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.

సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి.

ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితాముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ సంపుటులలో ఇది రెండవది.

నాటకం సమాహారకళ. సాహిత్యం, సంగీతం, నృత్యం ఈ మూడింటి సమ్మేళనమిది. వాస్తవానికి ఈ దృశ్యకావ్య ప్రక్రియకు శిల్ప చిత్రకళలతోనూ సంబంధం ఉంది. ఆ విధంగా లలితకళా సమాహారం అది. అందువల్లే ‘కావ్యషు నాటకం రమ్యం' అనే సూక్తి ఏర్పడింది. శ్రవ్యకావ్యరచన కంటే దృశ్యకావ్య రచనకు కావలసిన సామర్థ్యాలెక్కువ. సోమయాజులుగారు చేయి తిరిగిన నాటక కర్త. విశ్వవిఖ్యాత నాటక కర్త షేక్స్పియర్ నాటకాలను అనువదించడమేకాకు స్వయంగా అనేక నాటక రచనలు చేశారు. వీటిలో మూడు వసంతసేన, నాయకురాలు, డాక్టరు చైతన్యం బృహన్నాటికలు. ఆయన దృశ్యాలుగా విభజించుకొని చేసిన ఈ రూపకాలను నాటికా విభాగంలోకి చేర్చవచ్చు. 'వసంతసేన' మూలం భాసుడి దరిద్ర చారుదత్తం, శూద్రకుడి మృచ్ఛకటికం. 'నాయకురాలు’ చారిత్రక నాటిక. 'డాక్టరు చైతన్యం' సాంఘిక నాటిక. 5