Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/456

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వాసరావ్: మాయీ, జిజియా మాయీ!! ప్రభూ! శివాజీ ప్రభూ!!

జిజియా: రా, నాయనా నీకు నూరేండ్లు.

శివాజీ: కోటలో ప్రవేశించటానికి ఎంతో కష్టపడ్డావని విన్నాను. మోరే చెప్పాడు. నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేను.

విశ్వాసరావ్: మీ కృప నా మీద ఉంటే అంతే చాలు. అవన్నీ ఒక కష్టాలా. కానీ వెనుకటి బీజాపురం కాదు. లంచాలు అణుమాత్రం పనిచెయ్యటం లేదు. ఎటువంటి అంతఃపురం వారైనా అట్టే బయటపడేది పూర్వం. ఇప్పుడు ఎంత భూమి ఎర చూపించినా ఇంత రహస్యం కూడా బయటికి రావటం గగనంగా ఉంది. పసిబిడ్డను రాజ్య సింహాసనమెక్కించి రజియాబేగం బలే పకడ్బందీగా పాలిస్తున్నది.

శివాజీ: ఆమె మహా సమర్థురాలన్నమాట!

విశ్వాసరావ్: సమర్థురాలే కాదు. చండశాసనురాలు. రెండు కళ్ళూ విప్పి చక్కగా చూచిందంటే చచ్చినంతపని గాని సర్దారంటూ కనిపించటం లేదట! మొగలాయీ రాజకుమారులు సైన్యాలతో ఉత్తరానికి వెళ్ళిపోయారన్న వార్త వచ్చిన మరుక్షణంలోనే సర్దారులు నందరినీ పిలిపించి సభ తీర్చింది. ఉత్సాహంతో ప్రసంగించి వాళ్ళ రక్తాన్ని ఉడుకెత్తించింది. తమ రాజ్యాన్ని సామ్రాజ్యం చేసి గాని నిద్ర పోనన్నది. అందుకు ముందుగా మహారాష్ట్ర శివాజీని మసిచెయ్యాలట.

జిజియాబాయి: అంతేనా?

విశ్వాసరావ్: క్షమించాలి. అతడి శిరస్సును తెచ్చి ఇచ్చినవాళ్ళకు ప్రస్తుతానికి ఒక పరగణా బహూకరిస్తుందిట! మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన తరువాత మున్సబ్దారును చేస్తుందిట!!

జిజియా: మరి సభలో “ఆ పని నేను చేస్తా"నని ఎవరైనా ముందుకు వచ్చారా?"

విశ్వాసరావ్: ఆఁ ఆమె సోదరుఁడు. అప్జల్‌ఖాన్ ఆ పనికి తాను పూనుకుంటానని అల్లామీద ప్రతిజ్ఞ చేశాడు.

శివాజీ: అప్జల్‌ఖానా! అతఁడు ఆప్ఘన్ వీరుడు కదూ! మొగలాయీలతో బీజాపురం చేసిన యుద్ధాలల్లో పేరు గన్నాడని విన్నాను.


456

వావిలాల సోమయాజులు సాహిత్యం-2