శివాజీ అఫ్‌జల్ ఖాన్
శివాజీ: గురుదేవ్, రామదాస స్వామీ, హైందవ సామ్రాజ్యాన్ని నిర్మిస్తానని మీ పాదాలకు
వందనం చేసి ప్రతిజ్ఞ గైకొన్నాను. మానవ యత్నమంతా చేస్తున్నాను. కానీ దైవం...
మాయీ భవానీ! నీ దయవల్ల శత్రువులకు చేజిక్కకుండా ఇంతవరకూ ఎన్నో ఆపదలను
గడిచి వచ్చాను. కష్టాలమీద కష్టాలను తెచ్చిపెట్టి నన్నింతగా అగ్నిపరీక్ష
చేయదలిచావేమ్మా!
జిజియాబాయి: శివా! (లోపలినుంచి వస్తూ వున్నట్లు) మళ్ళీ ఏం మార్పు వచ్చింది నాయనా! నీ ఇష్ట భృత్యులెవరైనా నిన్నా మొన్నట్లో శత్రువులతో చేరిపోయినారా?
శివాజీ: అదొక విశేషమే కాదు. అయినా అటువంటి దేశద్రోహులు మన మహారాష్ట్ర జాతిలో మరింతమంది లేరు.
జిజియాబాయి: అయితే నీవు కళ్యాణదుర్గాన్ని కొల్లగొట్టావని నిన్ను సాధించేటందుకు మీ నాన్నగారిని చెరసాలలో ఉంచి చిత్రహింసలు పెడుతున్నారట?
శివాజీ: ఇప్పుడు నన్ను సాధించటానికి బీజాపురం వారికి ఇటువంటి పిరికి పనులతో పనిలేదు. కాలం ఎంతో అనుకూలంగా వారికి కలిసి వచ్చింది. ఢిల్లీ రాజ్యం కోసం మొగలాయీ రాజు కుమారుల మధ్య అంతః కలహాలు చెలరేగాయి. దేవగిరి ప్రాంతం నుంచి నాకు మిత్రుడుగా ఉంటాడన్న మొగలాయీ రాకుమారులు ఢిల్లీకి సైన్యాలను తరలించికోవెళ్ళారు.
జిజియాబాయి: అయితే ఇక వారి దృష్టి అంతా నిజంగా నీమీదనే నిలిపి బీజాపురం వారు వ్యవహరిస్తారన్నమాట!... అక్కడికి వెళ్ళిన విశ్వాసరావు వచ్చాడా?
శివాజీ: లేదు. ఫకీరు వేషంతో బీజాపురం కోటలో అతడు ప్రవేశించటాన్ని చూచి, మోరే, ఎన్నాళ్ళకూ అతడు తిరిగి రాకపోవడం వల్ల విసుగు వచ్చి తిరిగి వచ్చేశాడు. బహుశః అతడు చిత్రవధకు గురై ఉంటాడేమో!
జిజియాబాయి: అలా ఊహించటానికి వీలు లేదు. అతడికి ఏ ఆపదా కలగదు. అతడు దీర్ఘాయుష్మంతుఁడని దాదాజీ వెనక జోస్యం చెప్పారు.
ఏకాంకికలు
455