Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుడు : లేకపోతే గత్యంతరమేముంది. ఈ ఘోర దారిద్ర్యాన్ని ఎన్నాళ్ళు అనుభవిస్తారు.

మల్లన్న : మేమేం దారీద్య్రాన్ని అనుభవించటం లేదే! కష్టపడిపొలం దున్నుకుంటాం. పండిన దేదో వండుకొని సుష్ఠుగా భోజనం చేస్తాము. పత్తి పండించుకొని వడికి నేయించుకొని బట్టలు కట్టుకుంటాం. మాకేం లోపము? దేనికీ లోపము?

శ్రీనాథుడు : బాగుంది పద్ధతి. ఏముంది. గురివెంద చేరులు పెట్టుకొని కులికే కోయపిల్లకు కంసాలితో పనేముంటుంది. సుఖపడటమంటే ఏమిటో ఎరగని వాళ్ళకు తమకేం కావాలో, ఏం లోపమో ఏం తెలుస్తుంది.

మల్లన్న : భౌతిక జీవితానికి అవసరమైనంత వరకు కోరుకుంటాం. కష్టపడి సంపాదించుకుంటాం. కోరికల కళ్ళాలు సడిలిస్తే మళ్ళీ చేతికి చిక్కుతాయా? ఏదో పరమేశ్వరుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి గాని ఊరికే కోరికలు పెంచుకుంటే మానవజీవితం ఎంత దుర్భరమై పోతుందో ఆలోచించావా?

శ్రీనాథుడు : మేము కష్టపడుతున్నామంటావు. అదంతా వృథా శ్రమ. మనకు కాని శ్రమ. లేకపోతే కవులకు కర్షక వృత్తేమిటి? ఎందుకు -

మల్లన్న : స్వేచ్ఛను చంపుకోకుండా కాపాడుకోటానికి, సత్యాన్ని రాజభయం లేకుండా బహిర్గతం చేసే స్వాతంత్య్రం ని

న్నీ     రక్షించుకోటానికి -

శ్రీనాథుడు : స్వనాశన సమయంలో కూడా స్వాతంత్య్ర రక్షణ మనబోటి సంసారులకేం సాగుతుంది. మహాత్ములైన మహర్షులకు గాని.

మల్లన్న : మామా! అయితే నీవు మా నాన్నను ఏ మహారాజునైనా ఆశ్రయించి ఒక అగ్రహారం సంపాదించమంటావు. అంతేనా?

శ్రీనాథుడు : లేకపోతే జీవన సముద్రాన్ని తరించేదెట్లా? దారిద్య్ర నౌక నెక్కితే దరిజేరటానికి అవకాశం ఉందో లేదో ఆలోచించుకోకపోతే ఎలా?

మల్లన్న : 'పునరపి జననం, పునరపి మరణం'గా జీవయాత్ర సాగిద్దామనుకుంటే మటుకు యీ సాంయాత్రికతకు అంతెక్కడో, అవధియెక్కడో కూడా ఆలోచించుకోవాలి కదా?


ఏకాంకికలు

361