ఉత్పల : కొంతకాలం క్రితం ఈ గీతాన్ని నగరంలోని ఓ గోష్ఠిలో పాడి వినిపించింది. భదంతుడు : అమ్మా నీవు అది పాడగలవా? ఉత్పల : పాడగలను... నావికా! బ్రతుకన ఆశయె లేదిక! కడలిని తడబడి కానను దారెదొ పెనుజడి అలజడి ననుగన రావో - భదంతుడు : చాలా చక్కని కంఠమమ్మా నీది! గీతం వింటున్నంతసేపూ ఏవో అవ్యక్తానుభవాలు లీలగా ద్యోతకమైనవి. ఉత్పల : మీరు ఎన్నడైనా కొంతకాలం పాటలిలో ఉన్నారా? భదంతుడు : అనేక మారులు మేము అక్కడనే బుద్దపూజ ఆచార్య సమితావ్రీలతో కలిసి జరిగించాము. ఉత్పల : ఎప్పుడైనా 'ఉత్పలపర్ణ' పేరు విన్నారా? భదంతుడు : లేదమ్మా! ఆమె అంత ప్రసిద్ధురాలా ఏం?
ఉత్పల : రాజలోకంలో ఎప్పుడూ ఆమె పేరు చెవినబడుతూ ఉంటుంది. నాగరకుల మాట చెప్పనవసరంలేదు. వారికామె దేవతామూర్తి. భదంతుడు : (ప్రశ్నపూర్వకంగా) ఆమె.... ఉత్పల : నర్తకి... గాయని కూడాను. భదంతుడు : నీకేమైనా స్నేహితురాలా? ఉత్పల : కాదు గర్భశత్రువు... అయితేనేం ఆమె అంటే నాకో వెర్రి అభిమానం. ఆమె దుస్థితిని చూస్తే నాకో కనికరం! భదంతుడు : దుస్థితా? 322 వావిలాల సోమయాజులు సాహిత్యం-2