కులాలుడు : (వచ్చి నమస్కారం చేసి) చెప్పారండి బాబు చెయ్యాల్సిన పని. అదెంతసేపు. రేపు ప్రొద్దున్నే చేసినా చెయ్యవచ్చు. అనుగ్రహం ఉంచాలి.
(అని ప్రక్కకు తొలిగి నిలవబడతాడు)
ఏలేశ్వరుడు : సరేలే. బావగారు! మనము వెళ్ళి వద్దాం ఆ పనికి.
(ఏలేశ్వరుడు, కృష్ణపంతు నిష్క్రమణ)
(తెర)
(ఆడపిల్ల వారింట్లో)
(తెల్లవారింది. పెళ్ళి పందిట్లో ముగ్గులు వేసి వుంచారు. ఏలేశ్వరుడు జపం చేస్తూ అరుగుమీద కూర్చున్నాడు. రేవణశర్మ మాంగల్యానికి పసుపు పట్టిస్తూ వివాహానికి కావలసిన వస్తువులు పందిట్లోకి తెచ్చుకుంటాడు)
రేవణశర్మ : (కులాలుని చూచి) అరే! యంత్రం నిర్మించావా?
కులాలుడు : (నీటి తొట్టిలో ఒక క్రొత్త కుండకు సున్నం వ్రాసి దాని అడుగున బెజ్జము చేసి నీరు నెమ్మదిగా కుంభంలోనికి వచ్చి అనుకున్న కాలానికి కుండ మునిగిపోయేటట్లుగా పూర్వం నిర్మించిన యంత్రాన్ని చూపిస్తూ) అదిగో! చాలాసేపైంది బాబూ నిర్మించి. కానీ ఎన్నో కుండలు వృధాగా పగిలి పోయాయి. (చివర మాట పని తొందరలో రేవణశర్మ వినిపించుకోడు)
రేవణశర్మ : (ఎటో చూస్తూ) ఐదున్నర ఘడియలకు నిండేటట్లుగా చేశావా?
కులాలుడు : అవును స్వామీ!
రేవణ శర్మ : (ఇంట్లోకి హడావిడిగా పోయి) అమ్మాయికి మంగళస్నానం చేయించారా? కానియ్యండి త్వరగా. (బయటకు వచ్చి భజంత్రీలతో) కానియ్యండిరా మంగళవాద్యం, ఉ! అనండి.
(ధ్వనిగా మంగళవాద్యాలు)
(ఏలేశ్వరునితో) బాబూ! లేవండి మధుపర్కాలు తీసికొని రాండి, పోదాం వరపూజ కోసం (ఏలేశ్వరుని భార్య పందిట్లోకి వస్తే) అమ్మా! పసుపు, కుంకుమ, గంధం, అగరు వత్తులూ మరచిపోవద్దు. తొందర చెయ్యండి. (ఎందుకో రేవణ శర్మ చేతిలో మంగళసూత్రం క్రింద పడుతుంది)
314
వావిలాల సోమయాజులు సాహిత్యం-2