Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైతన్యం : సారీ! నేను ఏ సంస్థతోనూ సంబంధం పెట్టుకోదలచలేదు.

ముసలయ్య : (ఆతురతతో ప్రవేశించి) భుజంగంగారి నోటు బాకీ ఇవ్వలేదని బుడేసాహెబు దౌర్జన్యం చేసి సన్యాసయ్య తలబద్దలు కొట్టి వెళ్ళిపోయినాడు - నెత్తురు వరదలై పోతున్నది. కట్టుకట్టించాలి బాబూ!

చైతన్యం : నేను వస్తున్నాను. సుబ్బయ్యను ముందుగా వెళ్ళి లోషను పెట్టి గాయం కడుగుతుండమను (పుణ్యకోటితో) ఇదండీ, ఈ గొప్పవారు చేస్తున్న ప్రజాసేవ. తాము చిక్కకుండా తప్పించుకోగలరు.

పుణ్యకోటి : వీళ్ళెంత మూర్ఖులో మీరు గమనించలేదు. ఆమాత్రం భయపెట్టకపోతే ఆయనమటుకు ఎన్నిటికని కోర్టెక్కుతాడు.

చైతన్యం : వాళ్ళు మూర్ఖులు కాకపోతే అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తున్న భుజంగంగారు మూర్ఖుడౌతాడా? - ఈ నాగరికత ఇలా నడిచేటంతవరకూ వారికేం ప్రమాదం లేదు - సెలవు.

(నిష్క్రమిస్తాడు)

పుణ్యకోటి : (చైతన్యాన్ని ఉద్దేశించి) పాపం ! బాగుపడలేని పెద్దమనిషి! ముసలయ్య వచ్చి అవీ ఇవీ సర్దుతూ ఉంటాడు) ఏమోయ్ నీవు డాక్టరుగారి దగ్గిర పనికి కుదిరావా ఏం?

ముసలయ్య : ఆయన నాకు ప్రాణాలిచ్చారు బాబూ!

పుణ్యకోటి : (నవ్వుతూ) ప్రాణాలివ్వటమే! చంపేశావు!! ఆయన్ను అమాంతంగా దేవుణ్ణి చేసి కూచోపెడుతున్నావే? ఉఁ. డాక్టరుగారి సంపాదన జోరుగా ఉన్నట్లుంది?

ముసలయ్య : పేదోళ్ళదగ్గిర కానీ పుచ్చుకోని అయ్యకు సంపాదనే ముంటుంది? మోతుబరి రైతులేమైనా ఇస్తే అదీ మాకు మందుకోసం ఖర్చు పెడుతుంటాడు.

పుణ్యకోటి : సంసారమదీ ఏమీ లేదనుకుంటాను. ఇంకేం చేస్తాడులే.

ముసలయ్య : ఈ దొరలేకపోతే మొన్నటి మారెమ్మకు ఊరంతా తుడుచుకు పొయ్యేది.

పుణ్యకోటి : (నవ్వి) పిచ్చివాళ్లు! తెలివితేటలంటే ఇలా ఉండాలి. పెట్టెలమీద పెట్టెలు ఈయనకు మందు సప్లై చేసిన మహాత్ముడు భుజంగంగారు పోనేపోయినాడు.

ముసలయ్య : ఆయన బాబుగారి ఇల్లు తాకట్టు పెట్టుకొని ఇచ్చారటగా బాబూ!


244

వావిలాల సోమయాజులు సాహిత్యం-2