Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యకోటి : కేవలం ఆయనలో మీరన్న డబ్బొక్కటే కాదు. విద్య, ధనం, దానం, త్యాగం, భోగము - అన్నీ ఒక్కచోట రూపొందినవి. మొన్నటి వారపత్రికలో ఆయన సంపాదకీయం చదివారా?

చైతన్యం : 'ప్రగతి' మాటేనా? అది వారి పెట్టుబడిలో నడిచే పత్రికేగామాలి. పత్రికావిలేఖరులను కూడగట్టుకుంటే ప్రతిష్ఠకేమి లోటండీ!!

పుణ్యకోటి : అలా అనటం సాహసం.

చైతన్యం : అయితే ఇన్నాళ్ళబట్టీ ఏదో ఉడతాభక్తిగా ఉచితవైద్యం చేస్తూ ప్రపంచమంతా మెచ్చుకుంటున్న ఆ గాంధీతత్వాన్నే ప్రచారం చేస్తున్నాను గదా, నన్ను గురించి నాలుగు మంచిమాటలు ప్రగతి ఎప్పుడూ పలికినట్లు కనిపించదు?

పుణ్యకోటి : దానికి కారణ మేమిటంటారు?

చైతన్యం : అందరూ లక్ష్మీపుత్రులు కాకపోవటమూ, మణెమ్మలతో పరిచయం లేకపోవటము.

పుణ్యకోటి : మణెమ్మగారిని గురించి మీరు మహాపొరబాటైన అభిప్రాయం పడుతున్నారు. మన సంఘంలో ఉన్న దుర్గుణం అది. కాస్త ముందుకువచ్చే స్త్రీని చూస్తే కళ్ళల్లో దుమ్మోసుకుంటారు. అపనిందలు అంటగట్టుతారు - ఆమెలో ఏ గుణం లేకపోతే అంత ఇన్ఫ్లుయన్సు అందరిలో ఎలా వచ్చిందంటారు?

చైతన్యం : ఏమి ఇన్ఫ్లుయన్సు?

పుణ్యకోటి : ఏమి ఇన్ఫ్లూయన్సు అంటే చెప్పేదేమిటి? ఊళ్ళో ఉద్యోగులూ, ఉద్యోగేతరులూ ఆమె మాటకు అంతా అడుగుదాటటానికి వీలుందా?

చైతన్యం : అలాగేం? - ఆమె మీ సమితి ఉపాధ్యక్షురాలు గామాలి.

పుణ్యకోటి : మహిళామండలి అధ్యక్షురాలుకూడాను. సమితికి గొప్ప సాయం చేస్తున్నది.

చైతన్యం : నిర్మాణ కార్యక్రమం సాగించారా ఏమైనా?

పుణ్యకోటి : పార్టీని బలపరచటానికి పైకికొట్టిన టెలిగ్రాముల్లో ఆమె ఇంతంత పనిచేసిందని చెప్పలేము. - వారం దినాలల్లో క్రొత్త ఎన్నికలు వస్తున్నవి. మిమ్మల్ని సభ్యులనుగా జేసి అధ్యక్షుణ్ణిగా చెయ్యాలని భుజంగంగారూ, మణెమ్మగారూ ఏకాంతంగా ఆలోచించారు.


డాక్టరు చైతన్యం

243