చంద్రశేఖరం : యు ఆర్‌రైట్. ఒక్క షేక్‌హాండు ఇలా పారెయ్యి. ఇద్దరు కార్యదర్శులు. ఒకరు ప్రధాన రెండవవారు సహాయ.
పుణ్యకోటి : నీవు ప్రధాన
చంద్రశేఖరం : ఉః నీవు ప్రధాన - మరి చెప్పినట్లు వినాలి. సహాయ కార్యదర్శిని ఎన్నుకోటంలో ఒక్క మాట మరచి పోకూడదు సంఘం కాస్త పచ్చపచ్చగా ఉండాలి. అర్థమైందనుకుంటాను.
పుణ్యకోటి : పడతి అని తమ భావమా గురుదేవా?
చంద్రశేఖరం : (విచిత్రకంఠంతో) ఔను శిష్యశేఖరా?
పుణ్యకోటి : (రెండు వేళ్ళు చూపించి) మీ ఇష్టం వచ్చినది కోరండి.
చంద్రశేఖరం : (ఒకవేలు కోరుతాడు) ఉఁ సహాయ కార్యదర్శి జయా! మణెమ్మా!
పుణ్యకోటి : జయను ఎన్నుకుంటే మణెమ్మకు కోపంరాదూ?
చంద్రశేఖరం : ఆమె మాట ఎలా ఉన్నా భుజంగానికే రావచ్చు. అయినా ఉపాధ్యక్షపదవి ఉందిగా అది పారేద్దాం.
పుణ్యకోటి : మరి నీవో?
చంద్రశేఖరం : (నవ్వి) మనను అలా దూరంగా ఉజ్జీ. బాపూజీ కాంగ్రెస్‌లో పావలా మెంబరైనా కానట్లు. ముహూర్తం ఈ క్షణానే. భుజంగం రాగానే ఆయన వెంట పత్రికా విలేఖరి తప్పనిసరిగా ఉంటాడు గనుక సమితి స్థాపనను గురించి గట్టిగా పత్రికల్లో గుద్దిచ్చామంటే దేశంలో కావలసినంత కళవళం బయలు దేరుతుంది.
పుణ్యకోటి : జయమ్మ అంగీకరిస్తుందా, నాతో కార్యదర్శిగా ఉండటానికి?
చంద్రశేఖరం : అనుమానం ఎందుకు రావలసి వచ్చింది? మహ చక్కగ అంగీకరిస్తుంది. ఆ భారం నామీద పారెయ్యి. లోపలికి వెళ్ళి జయతో మాట్లాడి చిన్న పార్టీ ఇక్కడికి సిద్ధం చేయించు. భుజంగంగారి విందుకు ముందే సమితి స్థాపన జరిగిపోవాలి. జయతో మాట్లాడి ప్రస్తుతం అక్కడున్నవి తినటానికి పట్టించుకోరా?
చంద్రశేఖరం : (కాసేపు పేపరు తిప్పి పారేసి - చెష్టుమీద ఉన్న 'గీత' తీసి ఒక శ్లోకం చదువుతాడు)
228
వావిలాల సోమయాజులు సాహిత్యం-2