Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యకోటి : తప్పకుండా మట్టిగుంటలో మహాసభలు జరిగిన తరువాత మన నగరంలో పెద్ద ఎత్తున ఒక సప్తాహం తలపెట్టి తలకాయ ఉన్న పెద్దవాడినల్లా పట్టుకువచ్చి గద్దె ఎక్కించాలని నాకుంది. మీరేమంటారు?

జయ : తప్పకుండా అటువంటి సమ్మోహనాస్త్రాలు చాలా బాగా పనిచేస్తవి... కానివ్వండి.

పుణ్యకోటి : 'కానివ్వండని' ఏమిటాతప్పుకోటం. స్వాతంత్య్రం వచ్చిందన్న మాటే గాని, స్వాతంత్య్రనేత బాపూజీ తత్వం దేశానికి జీర్ణం కాలేదు. నిర్మాణ కార్యక్రమ ప్రణాళికలతో కాగితాలు నిండిపోతున్నవి. కాని ఒక్క పనీ కార్యరూపం దాల్చటం లేదు. “దేశంలో నాలుగుమూలలా ప్రజానాయకుల జీవితచరిత్రలు, కట్టుకథలుగానూ, హరికథలుగానూ, బుర్రకథలుగాను చెప్పించి, ప్రజల్లోకి చొచ్చుకోపోయి చైతన్యం రేకెత్తించి”...

జయ : (నవ్వుతూ) క్షమించాలి ఉపన్యాసధోరణిలో పడిపోతున్నారు.

పుణ్యకోటి : ఒహ్ ఎక్సూజ్ మి... మరి మీరు నాకు ఈ సందర్భంలో ఏమి సాయం చేస్తారు?

జయ : ఎదురు చెప్పకుండా చెప్పింది విని ఊరుకుంటాను.

పుణ్యకోటి : అలాగేం పాపం!! తప్పించుకుందామనుకుంటున్నారుగామాలి. టౌన్ హాల్లో ఒక సంగీతసభ ఇవ్వాలి. కార్యక్రమం అచ్చు వేయించడానికి కూడా మనదగ్గర 'చేతన్ లేదొక చిల్లిగవ్వయును'

జయ : (ఆలోచించి) పాటకచ్చేరీ అని అన్నిటికీ మాటిమాటికీ నేనే తయారైతే ఏం బాగుంటుంది?

పుణ్యకోటి : ఎన్నోమాట్లు ప్రజలు మిమ్మల్ని వినటమూ (చిరునవ్వుతో), అంతకంటె అధికంగా చూడటమూ వల్ల మాకు టిక్కెట్లు అమ్ముకోటానికి అంత తికమక లేదు. కాలేజీలు అన్నీ రీ ఓపెన్ అయినవి. స్టూడెంట్సు దగ్గిర డబ్బు పుస్తకాలకనీ బుగ్గికనీ తెచ్చుకున్నది పుష్కలంగా ఉంటుంది. మంచివి రెండు మూడు పులుముడు భావగీతాలు అభ్యుదయపంథాలో విసిరిపారేశారంటే అంతా డబ్బే!... మరి అచ్చు గుద్దిస్తాను.

జయ : ఆలోచించిగాని వాగ్దానం చెయ్యలేను.

పుణ్యకోటి : (ఉపన్యాసధోరణిలో) జయమ్మగారూ! మీరు గమనించటం లేదు. మన సంఘం సమస్తవిధాలా అధోగతి పాలైపోతున్నది. 'స్త్రీజాతి' అభ్యుదయం


224

వావిలాల సోమయాజులు సాహిత్యం-2