శర్విలకుడు : మీ అక్క వసంతసేన.
మదనిక : ఇంట్లో పెత్తనమంతా ఆమె తల్లిది. మా అక్కమాటే సాగితేనా, పరిచారకుల నందరినీ ఊరికే విడిపిస్తుంది - కానీ నన్ను విడిపించేటంత ధనం నీకు ఎక్కడినుంచి వచ్చింది.
శర్వీలకుడు : మదనికా! నీమీద ప్రేమ నా చేత ఒక సాహసకృత్యం చేయించింది.
మదనిక: ఆఁ! సాహసమా!!
శర్విలకుడు : అది కేవలం సాహసకృత్యమే కాదు పాపకృత్యం కూడాను రాత్రికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టాను. కాని శ్రమకు ఫలితం మాత్రం దొరికింది - ఇదిగో హారము! - (రొండిన దోపినమూట సంచినుంచి బయటికి తీస్తాడు)
మదనిక: (ఆశ్చర్యంతోనూ అన్వేషణగా) ఆఁ, శర్విలకా!
శర్విలకుడు : (హారంవైపు తదేకదృష్టితో) ఉస్ - వసంతసేన కిచ్చి ఆమెతో అప్పుడప్పుడూ ఉపయోగించమని చెప్పి నిన్ను విడిపించుకో. మనమిద్దరమూ వివాహం చేసుకొని సంతోషంగా కాలం గడుపుదాము.
మదనిక : (హారంమీదనే కళ్లు నిలిపి చూస్తూ) ఏదీ హారం?
శర్విలకుడు : (చేతికందిస్తాడు)
మదనిక : (పరీక్షిస్తూ) ఎక్కడో చూచినట్లుంది, నీకిది ఎలా దొరికింది?
శర్విలకుడు : అదంతా నీకెందుకు? ఇది తీసుకోవెళ్ళి ఆమెకిచ్చి నిన్ను విడిపించుకో!
మదనిక: ఈమాత్రం రహస్యం చెప్పటానికే నమ్మలేకపోతే ఇక మనమేమి వివాహం చేసుకుంటాము. మనస్సులో మనస్సు కలిపి సుఖపడతాము.
శర్వీలకుడు : చారుదత్తుడి ఇంటికి ఎవరో దొంగలు కన్నం వేశారని జనం చెప్పుకోటం వినలేదూ?
మదనిక: (ఆవేగంతో) ఆ పని చేసింది నీవేనా? - ఆ యింట్లో ఎవరినీ కత్తితో పొడవలేదు కదా?
శర్వీలకుడు : (దీనాననంతో తల త్రిప్పుతాడు)
మదనిక : గాయపరచలేదు గద?
————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2