Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనిక : ముందు మీరు వస్తున్నారని నేను లోపలికి పోయి అక్కకు చెప్పి వస్తాను. మీరు ఇక్కడనే ఉండండి. (లోపలికి పోబోతుంది)

శకారుడు : అ హఁ హఁ, వద్దు వద్దు, నా మాట విను. తరువాత మీ అక్క చేతిలో నన్ను వెంట తీసుకోరాలేదేమని దెబ్బతింటావు. నీ మంచికి చెబుతున్నాను. పోదాం పద.

మదనిక: (దూరంగా శర్విలకుడు వెతుకుతుంటాడు. ఆమె చప్పట్లు చరిచి శర్విలకుని పిలుస్తుంది) శర్విలకా! శర్విలకా!! ఇక్కడిక్కడ! శకారుడు : అమ్మాయీ! ఎవరో మొగవాళ్ళను పిలుస్తున్నావే. సరేలే. నేనూ, బావా, సాయంత్రం వస్తామని మీ అక్కతో చెప్పు. అఁ - అయితే ఆ హారము - పోనీలే, నీ మెడలోనే ఉంచుకో.

(నెమ్మదిగా జంకుతూ అడుగులో అడుగు వేసుకుంటూ నిష్క్రమిస్తాడు)

శర్విలకుడు : (ప్రవేశిస్తూ శకారుడు తప్పుకొని పోతుంటే ఓర కంటితో చూస్తూ ఉంటాడు. దగ్గిరకు వచ్చి మదనిక చేయి చేత్తో పుచ్చుకొని) ప్రియా!

మదనిక : శర్విలకా! ఎందుకో తెల తెలపోతున్నావు? ఏమిటాదిక్కులు చూడటం?

శర్విలకుడు : (దీర్ఘంగా నిశ్వాసించి) తెల తెలపో కేంచేస్తాను?

మదనిక : ఏం చేశావు కాబట్టి

శర్వీలకుడు : ఎవరి పాపం వాళ్లను కలత పెడుతుంది. ఎవరూ మన మాటలు వినరు కదా! - ఎందుకో మనస్సులో దిగులుగా ఉంది.

మదనిక: సంగతేమిటి? - ఎందుకలా ఉన్నావు? శర్విలకుడు : ఏమీ లేదు.

మదనిక : చెప్పటానికేమో సందేహిస్తున్నావు.

శర్విలకుడు : సందేహమెందుకు. నీ దగ్గిర నాకు రహస్యమేమిటి?

మదనిక : మరి విషయమేమిటో చంపక బయటపెట్టు.

శర్వీలకుడు : మనం ఆమె కొన్నంత ద్రవ్యమూ ఇచ్చేస్తే నిన్ను విడిచి పెడుతుందా?

మదనిక : ఆమెవరు?

—————————————————————

వసంతసేన

143