Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగో దృశ్యం

(ఒకవైపునుంచి రదనిక బుట్టతోటీ - మైత్రేయుడు మజ్జిగ తప్పేలతోటీ ప్రవేశిస్తారు)

మైత్రేయుడు : (గుర్తుపట్టుతున్నట్టు నటిస్తూ) అమ్మాయీ!

రదనిక : బియ్యం నిండుకుంటే అక్కగారికి తెలియకుండా అప్పుకని బయలుదేరాను.

మైత్రేయుడు : ఇంట్లో తండులాలు నసంతేనా?

రదనిక : (ఆకాశంవైపు చూస్తూ) చాలా ఎండబడ్డది (నిట్టూరుస్తుంది).

మైత్రేయుడు : (ఆలోచనా పూర్వకంగా) నేను మొన్న షోడశమహాదానాలల్లో తెచ్చినవీ, నాకు మహన్యాసాలకు వచ్చినవీ మంత్ర పుష్పపు డబ్బులు పెట్టి కొన్నవీ - అన్నీ అప్పుడే అయిపోయినై - ఇంతవరకూ పొయ్యిలో పిల్లి లేవలేదన్నమాట!

రదనిక : ఈ పూటకు అయ్యీ కానట్లుగా ఉంటే అక్కయ్య గారు మడికట్టుకున్నారు బాబయ్యా!

మైత్రేయుడు : (దీనభావాన్ని ప్రకటిస్తూ) ప్స్ - పాపం! పదిమంది వంటవాళ్ళను పెట్టుకొని వండించి పంక్తికి వడ్డించే మా అక్కయ్యగారికి చివరకు చేతులుకాల్చుకోటం తప్పించాడు కాడు బ్రహ్మ. వాడి ముండమొయ్య. అయితే పచ్చి బంగారం తినవలసిన పండులాంటి సంసారానికి ఇంతటి పరమ దౌర్భాగ్య స్థితి రావలసిన అగత్యమే ముందట? చెపితే విన్నాడా? బ్రాహ్మడి కేం వ్యాపారం? మొదట్లో లాభాలు వచ్చినట్లే కనిపించి కొత్తనీరుతో పాతనీరు కొట్టుకోపోయింది. ఒళ్లు తెలియకుండా సమారాధనలకనీ, సంతర్పణలకనీ, సప్తాహాలకనీ, సహస్రాలకనీ ఒకటే దానాలైపోతే కుబేరుడు కూడా కొల్లబోక ఏమౌతాడు?

రదనిక : బాబయ్యా! మహాత్ముడు, ఆయననని ఏం ప్రయోజనం? తిని కుడిచే భాగ్యానికి మనం నోచుకోకపోతే - అడిగినవాళ్ళకల్లా లేదనకుండా పెట్టిన ఆయనకు పెట్టవలసి వచ్చేటప్పటికి లోకం విశ్వాసం మాలినదై పోయింది. కాలికి బలపం కట్టుకొని ఇల్లిల్లు

——————————————————————————

130

వావిలాల సోమయాజులు సాహిత్యం-2