వసంతసేన : మహాభాగా! జాజితావులు కుమ్మరించే మీ ఉత్తరీయం వల్ల నా శరీరం భూషితమే అయింది.
చారుదత్తుడు : అమ్మాయీ! నీ సరసహృదయం...
మైత్రేయుడు : రాజశ్యాలకుడు ప్రదోష సమయంలో ఆలయం నుంచి వస్తున్న ఈమెను బలాత్కరిస్తుంటే భయపడి మన ఇంటికి వచ్చింది. చారుదత్తుడు : ఈ దరిద్రచారుదత్తుడు భంగ్యంతరంగా భాగ్యవంతుడైనా డన్నమాట!.... వసంతసేనా! పరిచారికను నియోగించవలసిన పని చెప్పి పూజ్యురాలవైన నిన్ను పరాభవించాను. క్షమించాలి.
వసంతసేన : అనుచితమైన సమయంలో ఆర్యులకు శ్రమ కల్పించి నందుకు మీరే నన్ను క్షమించాలి.
మైత్రేయుడు : బాగుంది వంగిన వరిచేలలా మీరు ఒకరికొకరు నమస్కరించుకోవటం.
చారుదత్తుడు : (పరిహాసం వద్దన్నట్లు) మైత్రేయా!
వసంతసేన : (నగలు ఒక పాత్రికలో ఉంచుతూ) ఆర్యా! దయ ఉంచి దీనిని మీ ఇంట్లో దాచి ఉంచండి. వీటికోసం ఎవరైనా పాపాత్ములు వెంట పడవచ్చును.
చారుదత్తుడు : (గ్రహించమన్నట్లుగా మైత్రేయా! (ఛలోక్తిగా) నగలను దాచటానికి ఈ పేదవాడి ఇల్లు -
వసంతసేన : దానికి నమ్మకం ప్రధానంగాని, ఇంటి గట్టి కాదుగా!
చారుదత్తుడు : మైత్రేయా! ఈ పాత్రను జాగ్రత్తచేసి పగలు వర్ధమానుడూ రాత్రిళ్ళు నీవూ కాపాడుతూ ఉండాలి.
మైత్రేయుడు : అయితే దాచిపెట్టను ఇచ్చిన ఈ నగలను మనం
చారుదత్తుడు : తిరిగీ అడిగినప్పుడు ఇచ్చివేయాలి.
వసంతసేన : మరి నాకు సెలవా? తల్లిగారు నాకోసం దిగులు పడు తుంటారు. మదనిక వెళ్ళి చాలాసేపైంది.
చారుదత్తుడు : మైత్రేయా! అమ్మాయిని వీథిమూల తిరుగుడు దాకా తీసుకోపోయి దిగవిడిచి వస్తావా?
———————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2