శకారుడు : ఆడవాళ్ళనేనా?
కుంభీలకుడు : ఉఁ.
శకారుడు : (ధైర్యంతో) రానీ, వందలకొద్ది రానీ చూడు, మరి మన ప్రతాపం! (మీసం మీదికి చేయిపోనిచ్చి గొంతు సవరించుకొంటూ అడుగు ముందుకు వేస్తాడు)
వసంతసేన : (భయకంపంతో) మధూ! మధుకరికా!!
శకారుడు : బావా! బావా!!
వసంతసేన : (వెనుకకు నడుస్తుంటుంది)
శకారుడు : (ముందుకు నడిచి) (*) నీ వెంటపడి నేను తరుముతుంటే ఆపటానికి కుంతికొడుకైన ఆ శంతనుడికీ, రంభ కొడుకైన ఆ రావణాసురుడికీ ఇద్దరికీ చేతకాదు. మరింకెవ్వరికి శక్యం? నీ పల్లవిక, నీ పరభృతిక, మధు, మధుకరిక నన్నేమి చేస్తారు? (చెయ్యి పట్టుకోబోతాడు).
వసంతసేన : (యుక్తిగా) అయ్యా! నేను అబలను.
కుంభీలకుడు : అమ్మాయీ! నీకేమీ భయంలేదు.
శకారుడు : బావ చెప్పినట్లు, ఆఁ, నీకేమి భయంలేదు.
వసంతసేన : (గౌరవాన్ని నటిస్తూ) మీరు మహాత్ములు! తెలుసుకోలేక పోయాను. (నగలు తీసి యివ్వబోతుంది)
కుంభీలకుడు: (శకారుడివైపు చూస్తూ) మా ప్రభువుగారు నీ అలంకారాలకు ఆశపడేవారు కాదమ్మాయీ!
శకారుడు : (సదర్భంగా) మనమే ఇటువంటి అలంకారాలు అనేకమంది అమ్మాయిలకు అడిగించుకోకుండా ఇచ్చామని చెప్పవోయ్! వసంతసేన : అయితే మరి నన్ను నాదారిని -
శకారుడు : ఎక్కడికి?
వసంతసేన : నా ఇంటికి?
శకారుడు : (ఠీవిగా) పిల్లా! నేను దేవపురుష మనుష్యుణ్ణి!
———————————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2