దాటదీపరి! కసుమాల! దాట్లగుట్ట! దుక్కిపిట్ట! పిశాచంబు!! దొంగతొర్రు!!
(యక్షగాన ఫక్కికలో)
ఔర! రాజును నేను మాటాడకిట్లు
పారిపోతాదె బావ ఈ పడుపుకత్తె!!
(రొప్పుతూ) అవమానం సహించను. వెంటపడి జుట్టుపట్టి వెనక్కు లాక్కోవస్తాను. (పోబోతుంటే కుంభీలకుడు వారిస్తాడు)
శకారుడు : ఇప్పుడు ఎంతకోపం వచ్చిందో తెలుసునా - కుంభీలకుడు : ఔనౌను! - ప్రభువువారికి కుంభకర్ణుడి నిద్రంత కోపం వచ్చింది!
శకారుడు : బావా! నీకు నాతోపాటు వేటాడటమంటే ఇష్టమేనా?
కుంభీలకుడు : ఆఁ.
శకారుడు : కరుకుట్లు తినటమంటే ఇష్టమేనా?
కుంభీలకుడు : ఆఁ.
శకారుడు : అయితే నే చెప్పినట్లు విను - దీన్ని సాధించాలి.
కుంభీలకుడు : ఔను సాధించాలి. (ఇద్దరూ చేతిలో చేయి వేసుకొని ఊపుకుంటూ)
ఆరె పులీ! భళిరె. భళీ!!
నేను కలీ, నీవు బలీ
సంతకాడ సాని దాని
వంతపాట బంతి ఆట! ...ఆరె పులీ!!
మొన్న రేతిరి వెన్నెలలోన
నన్ను చూచి కన్నుగీటిన,
అన్నులమిన్న చిన్నదాని
కోలాటమె కోలాటము ...ఆరె పులీ!
(నిష్క్రమిస్తారు)
———————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2