మదనిక : అవును... ఆమె మా అక్కగారే!
చారుదత్తుడు : ఆలయానికి చాలా ప్రొద్దుబోయి బయలుదేరారు?
మదనిక : (ఛలోక్తిగా) మా అక్కగారు కోరినపూవు ఈ తోటలో ఇప్పుడే వికసించింది.
చారుదత్తుడు : పూలే వెతుక్కుంటూ వచ్చి మీ వాడలో అమ్ముడుపోవలసిందిగా!
వసంతసేన : ఆర్యా! అమ్మకానికి రాని పూవుమీద ఆశపెట్టుకొన్నప్పుడు అక్కడికే వెళ్ళక తప్పుతుందా!
చారుదత్తుడు : అమ్మా! నీ ఛలోక్తికీ, రసికతకూ సంతోషము.
వసంతసేన : ధన్యోస్మి.
చారుదత్తుడు : మీ వీణావాదనం వినటానికి ఎప్పుడైనా అవకాశ మిప్పిస్తారా?
వసంతసేన : తమ కభ్యంతరమా? (అంజలితో ప్రేమావలోకనం చేస్తుంది)
చారుదత్తుడు : మనఃస్వస్థత చూచుకొని ఒకమాటు మీ ఇంటికి ఏకాంతంగా వస్తాను.
మైత్రేయుడు : చారుదత్తా! ప్రొద్దు పోతున్నది. ఇంక బయలుదేరుదామా, ఆలస్యమైతే అక్కయ్యగారు ఆదుర్దాపడుతుంటారు.
చారుదత్తుడు : (బయలుదేరుదామన్నట్లుగా లేస్తూ) అమ్మా!
వసంతసేన : (నమస్కరిస్తుంది)
చారుదత్తుడు : మైత్రేయా! (బయలుదేరమని దారి చూపిస్తాడు)
(ఇరువురూ నిష్క్రమిస్తారు)
మదనిక : అక్కా! మొదట్లో అంత సిగ్గుపడ్డావేం? ఇంతకేనా ఏమిటో అడిగివేస్తానన్నావు?
వసంతసేన : ఆ రెండుముక్కలైనా ఎలా అనగలిగానో ఇప్పుడు నాకే అర్థం కావటం లేదు. ఏమిటో వారితో మాట్లాడటమంటే భయం వేసింది మదనికా! - అయితే వారు నా మనస్సు గ్రహించి ఉంటారా?
మదనిక : (చిరునవ్వుతో) ఏమో! అంజలిపట్టి ఆర్పకుండా కాటుకకళ్ళతో సంభాషించిన రసికురాలివి. నీకే అర్థం కావాలి.
———————————————————————
వావిలాల సోమయాజులు సాహిత్యం-2