Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శకారుడు : వసంతసేన రాదూ? కోపం వస్తున్నదా? సహించను. దాన్ని చంపేస్తాను (చిన్న మొండికత్తి మొలలో నుండి లాగి ఎక్కిళ్ళు పెడుతూ)

భళి, భళీ, ప్రభువులది
బంగారుబాట!
తనమాట వినకుంటే
తప్పనిది వేట!!

కుంభీలకుడు : (ఒళ్ళు తెలియటం లేదన్నట్లుగా అభినయించి దగ్గరకు పోయి తడుతూ) బావా! వసంతసేన వచ్చేస్తున్నది!

శకారుడు : ఆఁ!. రంభలా రమ్మను - (కత్తి మొలలో దోపి) అది వొచ్చేటప్పటికి నేను రమ్యంగా రాభణాసురుడిలా కనిపించాలి. ఇదుగో, బావా! ఈ హారం నీ మెళ్ళో వేసుకో. (హారం ఇస్తాడు)

కుంభీలకుడు : (అందుకొని మెళ్ళో వేసుకుంటాడు)

శకారుడు : (చొక్కాకు కుట్టిన అద్దం చూచుకుంటూ హారాలు సవరించుకుంటుంటే కుంభీలకుడు సహాయం చేస్తాడు) నేను ఇప్పుడు ఎట్లా వున్నాను బావా!

కుంభీలకుడు : మహారాజులుంగారిలా ఉన్నావు మన్మథ దేవుడి మరిదిలా ఉన్నావు.

శకారుడు : వసంతసేన వచ్చేటప్పటికి ముచ్చటగా ఆ అరుగుమీద కూర్చొని అసురగానం పాడుకుంటుంటాను.

కుంభీలకుడు : (చిరునవ్వుతో) బావా! నీ పాట వినిపిస్తే గుళ్ళు కూలిపోతాయి. వసంతసేన వచ్చినదోవనే వెనక్కు వెళ్ళిపోతుంది.

శకారుడు : అయితే ముద్దులు మూట కట్టేటట్లు పొలిమేరలో పోలేరమ్మలాగా గంభీరంగా కూర్చుంటాను. దాని చేతనే ఆడించు, పాడించు. (పోయి వేదికమీద సగర్వంగా కూర్చుంటాడు)

కుంభీలకుడు : (దూరం నడచి అదుగో ప్రాకారం దాకా వచ్చేసింది. (ఒక పద్దతిలో కూర్చోపెట్టి) ఇలా కూర్చో - గుమ్మం దాకా వచ్చింది.

శకారుడు : (బిర్రబిగిసి దగ్గుతాడు)

—————————————————————————————

112

వావిలాల సోమయాజులు సాహిత్యం-2