“ఆ రావణలంకానగ
రీలలామ రత్నకాంతి
దేహాచ్ఛాదన వసనం
గా అచ్చటిగోశాలలు
భూషణకాంతులుగను యం
త్రాగారమ్ములు ఉన్నత
వక్షోజాలుగ[1] నలంక
రించుకొన్న యట్లున్నది"
'శతకోటి ప్రవిస్తరమౌ
నీ ఋషీంద్రు మహాకావ్య
మం దెచ్చట తిలకించిన
సౌందర్యము, రససిద్ధియు,
శబ్దసౌకుమార్యాదుల
తో గూడిన కావ్యశిల్ప
మహనీయత గోచరించు
ఓ నారాయణసుకవీ!
ఆకవీంద్రు, ఋషిచంద్రుని
యోగశక్తి గొల్చి మీరు
అఘమర్షణ[2] మంత్రమ్ముల
వాచికమ్ము, పాంశువు[3] మా
నసికమ్మగు ముత్తెరగుల
స్వాధ్యాయము[4] అధ్యయనము
చేసి అమరులైనారు
కాకపోతె మీ కవితా
నైపుణ్యము, గాన కళా
పాండిత్యము లభ్యమౌనె!
—♦♦♦♦§§♦♦♦♦—
25 నారాయణదాస! నీవు
సౌందర్య మహాప్రతిమవు
శ్రీశారదకాకిలమవు![5]!నీ'కథ'లలో ప్రతిఒక్కటి
నిస్తులమౌసత్ప్రతీక [6]
నీరచనా వ్యాసంగము
నిరుపమమ్ము నిస్సీమము[7]
సకలదోష సంహననము![8]
సర్వప్రజా సంక్షేమము!!
భక్తజనుల మాంగల్యము!
దేవరాజ్య[9] దర్పణమ్ము.
—♦♦♦♦§§♦♦♦♦—
26 ఓ నారాయణ దాసా!
దివోదాస[10]!" దేవదాస!!
ఆకర్షితులై మీకడ
కరుగుదెంచినట్టి వారి
కులమత భేదాలు చూడ,
కంతేవాసులను జేసి,
ఆధ్యాత్మిక దృక్పథాన్ని
తృప్తితో దర్శింపజేసి
మోక్షకాములను నొనర్చి,
ఆదృష్టితో హరికథలను
చెప్పనేర్పి లోకసేవ
నాచరించు బుద్ధి నొసగి
దేవభూమి పర్యటనల
దేవపూజనా రీతుల,
దేవతార్చనా విధముల
శ్రద్ధాభక్తులను నేర్పి,
పరీక్షలలొ నెగ్గజేసి
సర్వమ్మును ఎరుకపరచి
మోక్షగాములను జేతువు!
- ↑ వక్షోజాలు = కుచములు
- ↑ అఘమర్షణ = సమస్త పాపములను పోగొట్టుటకు పఠించే మంత్రము (ఋగ్వేదము 10-190)
- ↑ పాంశువు =దుమ్ము
- ↑ స్వాధ్యాయము =తన శాఖకు చెందిన వేదాధ్యయనము లేదా జపము
- ↑ కాకిలము = కంఠహారము
- ↑ నిస్తులము = సాటిలేని
- ↑ నిస్సీమము = సాటిలేని
- ↑ సంహననము = నశింపజేయునది
- ↑ దేవరాజ్య = స్వర్గము
- ↑ దివోదాస = స్వర్గదాసుడు
________________________________________________________________________________
ఉపాయనలు
813