పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీలకంఠ దీక్షితుల 'కలివిడంబన' శతకానికి తెలుగు పద్యానువాదం 'కలివిడంబనము'. 'ఆంధ్రకామాయని', 'కన్నీరు' హిందీ మహాకవి జయశంకర ప్రసాద్ కృతులు 'కామాయని' 'ఆంసూ' లకు పద్యానువాదాలు.

సోమయాజులు గారి పద్య శైలి పూర్వ మహాకవుల ఒరవడిలో నడుస్తుంది. అదే సమయంలో సరళంగా పాఠక హృదయాలకు సుబోధంగా ఉంటుంది. మనం సాధారణంగా సంభాషణల్లో వాడే భాషకు దగ్గరగా ఉన్నట్లనిపిస్తుంది. అందుకే ధారాళంగా చదివిస్తుంది. సాధారణంగా పద్యరచయితలందరికీ గేయ రచనమీద పట్టు ఉండదు. కవికి కొంత సంగీతజ్ఞానం ఉంటే తప్ప గేయం రక్తికట్టదు. వావిలాల సోమయాజులుగారు పద్యగేయ రచనలు రెండింటిలో సవ్యసాచి అనదగినవారు.

ఐదు దశాబ్దాలకు పైగా వివిధ ప్రక్రియల్లో - పద్య కవిత, గేయ కవిత, నాటకం, నవల, కథ, గేయ నృత్యనాటికలు, విమర్శ, సృజనాత్మక వ్యాసం - అవిరామంగా కృషి చేసి వేల పుటల సాహిత్యాన్ని సృజించిన గొప్ప కవి, విమర్శకుడు, నాటకకర్త రచనలు పాఠకలోకానికి అందుబాటులో లేకపోవడం క్షంతవ్యం కాదు. వావిలాల సోమయాజులు గారి లభ్యరచనలన్నింటినీ సంపుటాలుగా తెచ్చే మా యీ ప్రయత్నంలో వారి కుమారుల తోడ్పాటు ఎనలేనిది. ఈ సందర్భంగా వారికి మా కృతజ్ఞతలు.

డి. చంద్రశేఖర రెడ్డి