పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సోమయాజులు గారి రచనలకు మరోపార్శ్వం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా భారతీయ దార్శనికతా ప్రియుడైన ఆయన బహాయీ సాహిత్యాన్ని అనువదించారు. క్రైస్తవ రచనలను అనువదించారు.

సోమయాజులుగారు ఇంగ్లీషులో కూడా కొన్ని వ్యాసాలు రచించారు.

సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్య బంధు, మధురకవి, కవి భూషణ, కుమార ధూర్జటి, పద్యవిద్యాధర వంటి అనేక బిరుదాలతో ఆంధ్ర సాహిత్యలోకం వావిలాల సోమయాజులు గారిని సమ్మానించింది. ఈ బిరుదులు ఆయన రచయితగా ఒకవైపు, సాహిత్య సేవకుడుగా మరోవైపు చేసిన కృషికి అద్దం పడతాయి.

ఐదు దశాబ్దాలకు పైబడిన సాహిత్య జీవితంలో సోమయాజులుగారు చేసిన అసంఖ్యాక రచనల్లో ఎన్నో అలభ్యంగా ఉండిపోయాయి. కొన్ని అముద్రితాలుగా ఉండిపోయాయి. లభించిన రచనల్లో ముద్రితా ముద్రితాలన్నింటిని కలిపి ఇప్పుడు ఆయన లభ్యరచనల సమగ్ర సంపుటాలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ సంపుటులలో ఇది మొదటిది.

ఈ సంపుటంలోని శివలోకనము 1990లో పింగళి కాటూరి సాహిత్య పీఠం వారి ప్రచురణ. ఇందులో 9 కవితా ఖండికలున్నాయి. ఖండకావ్యాలు కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురితాలు, మరికొన్ని ఆకాశవాణి కేంద్రాల నుండి ప్రసారితాలు; కొన్ని అముద్రితాలు.

భరతరస ప్రకరణం’ శ్రీమాన్ నీడామంగలం తిరువేంకటాచార్యులు వారి రచనకు గేయానువాదం. 'మహాకవుల మతం' రవీంద్ర కవితకు అనువాదం. గేయకవితలలో కొన్ని సోమయాజులు గారి స్వీయరచనలు. వీటిలో కొన్ని ముద్రితాలు, కొన్ని అముద్రితాలు. కొన్ని అనువాదాలు. గేయాలు ఆకాశవాణిలో ప్రసారితాలు.

ఉపాయనలు’ హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశస్తిని కీర్తించే గేయరచన. 1990లో ప్రచురణ. 5

5