Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే. వచ్చినతని సందేహించి ప్రశ్న సేయ
    నతఁడు కనిపెట్టి తెలియనీఁ డతని కథను
    అనిన ప్రశ్నల మూలాన నవతలతని
    భావ మెఱుఁగుట యౌ నసంభవము, నిజము. 176

తే. దాచుటకు నెంత యత్నింప దాచలేము
    మానవుల మనోభావాళి, మానవాళి
    యెడద నున్నట్టి భావమ్ము లెటులొ ముఖవి
    కారముల మూలమున నెట్లో కానఁబడును.177

తే. స్వకులజులు, నిరుగు పొరుగు పాలకులును
    దుష్టవేళలఁ గష్టాలఁ దోపఁ జేయు
    వారనెడివారు అందుచే వచ్చె నీతఁ
    డిచ్చటకు మనోవర్తన మ్మేర్చి పంప.178

తే. దోసిలిని బట్టి, దీనుఁడై తుష్టి యాచ
    నమ్మొ నర్చుచు శరణుకు నమ్రుఁడయ్యె
    శత్రువైనను నాతనిఁ జంపరాదు
    అట్లొనర్చిన ఘాతుకులండ్రు మనను.179

తే. ఆర్తుఁడైన శత్రువు దృప్తుఁడగుచు శరణు
    వేడినట్లైన, ప్రాణాలు విడుచు కొన్న
    దృఢుఁడు, ధీరస్వభావుండు తృప్తి నాత్మ
    ప్రాణముల నివ్వవలయును రక్షసేయ.180

తే. శరణుఁ గొని రక్షణము నొంద సాధ్యపడక
    శక్తిగల యాతఁడే చూచు సమయమందు
    నెవ్వఁడు నశించునో యతఁడేగు పుణ్యలోక
    మునకు రక్ష నీయని వాని పుణ్యమునను.181

తే. శరణు, రక్షణ కోరిన సలుపకుంట
    దోషము ఫలముగా, దివి తొలఁగు, నంతఁ
    గల్గు నపకీర్తి అతని గాఢ బలము
    వీర్యమును నితరమ్మును వీడిపోవు.182


216

వావిలాల సోమయాజులు సాహిత్యం-1