తే. పరులకును, దమకును గల భావములను
బుద్ధిలోఁ బరిశీలనఁ బొసఁగఁ జేసి
ప్రభువునకుఁ దెల్పఁగా దగు పరమహితము
తెల్పునాతండె యౌను మంత్రీశ్వరుండు.155
తే. వైరితో, మహాకోప సర్పమ్ముతోడఁ
గలసి నివసింపఁగా వచ్చుఁగాని మిత్రుఁ
బోలి కన్పించుచును శాత్రవాళిఁ బ్రీతిఁ
గొల్చువానితో వసియింపఁ గోరరాదు.156
తే. ఓయి, రాక్షస జగతిలో నున్నవారి
లక్షణమ్ముల నెఱుగుదు రమ్యముగను,
జ్ఞాతులకు గష్టములు కడు కల్గినపుడు
భూరిసంతోషమును వారు పొందుచుంద్రు.157
తే. జ్ఞాతి ముఖ్యుని, శూరుని, సర్వకార్య
కరణు, పండితు, ధర్మరక్షా ప్రవీణు
జ్ఞాతు లల్పునిగా భావన మ్మొనర్చి
వారి నిరతము నవమాన పరచుచుంద్రు.158
తే. కష్టవేళ నొకరి నింకొకరు గనుచును
హర్ష మొనరించు వారు నన్యాయ కార్య
కరణులును, గూఢులును, ఘోర కార్యపరులు
నైన జ్ఞాతులు భయకారు లయినవారు159
తే. అగ్నిగాని, యితరమైన యాయుధములు
గాని భయము గొల్పెడునవి గావు స్వార్థ
ఫలము నాశించి ఘోరమౌ పనులొనర్చు
వారు జ్ఞాతులు, కడుభయావహులు - నిజము!160
తే. మనను బంధించు కొరకుఁగా మార్గములను
జ్ఞాతులే తెల్పు చుందురు శత్రువులకు
ఇట్టి హేతువు వలననే యెల్లవేళ
మనకు జ్ఞాతుల వలనఁ బ్రమాదమగును.161
మధుప్రప
213