తే. అభ్యసించిన శాస్త్రమ్ము ననుసరించి
చేసి యోజన మంత్రులు చెప్పినంత
వారి మంత్రమ్ము అది అధిపతులు స్వీక
రింత్రు ఉత్తమ మనుచు భావించి యెడద. 148
తే. సామదాన భేదము లర్థ సాధనమ్ము
లెటుల నిష్పలమ్ములొ దాని కెటుల వీర
రసముఁ జూపించి, సాధింప లక్షణమ్మొ
పండితులు దెల్పుచుందు రపారముగను.149
తే. ఉన్నచో నజాగ్రత్తగా నున్నవారి
యందు, శత్రుభయమున నున్నయట్టివారి
యందు దైవము వ్యతిరేక మైన వారి
యందు శాస్త్రోక్త వీరమర్యాద చెల్లు.150
తే. ఖరుఁడు దుష్ట స్వభావుఁడా కారణమునఁ
జంపఁగా బూనె నతఁడు, రాక్షసుఁడు రాము
ప్రాణ రక్షార్థమై చంపె రాముఁడతని
ప్రాణులిల శక్తి రక్షింపవలయుఁ దమ్ము.151
తే. నీతిశాస్త్రానుసారుఁడై నిరతి యోజ
చేసి యెవ్వఁడు కార్యముల్ సేయుచుండు
నా ప్రభుడు దృఢ సంకల్పు డై వెలయును
వ్యథనొంద డెయ్యెడను కార్యమ్ములందు.152
తే. సవ్యమౌ నుపాయము లేక జరుపవలయు
దాని కంటెను వేరుగాఁ బూని జరుపఁ
బడిన కార్యమ్ము అర్హతఁ బడయునట్టి
వారి కిడినదగు హవిస్సు వంటి దగును.153
తే. ప్రథమముగఁ జేయవలసిన పనిని ముందు,
వెనుక చేయఁగ వలసిన పనిని ముందు
కొంద రొనరించుచుందు రా కొంతమంది
యెరుగరెది నీతియో యేది నీతి కాదొ!154
212
వావిలాల సోమయాజులు సాహిత్యం-1