Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇక ఈ కావ్యంలోని సాహిత్య సౌందర్యాన్ని ఇంచుక పరిశీలిద్దాం. వీరి సుమసుకుమారమైన శయ్యాసౌభాగ్యాన్ని వెల్లడించడానికి ఈ క్రింది పద్యాలు చాలు.


"ఈ సెలయేటి కేమిటికొ యింతటి వేగము నీ వెరింగినా
వే సఖి! చేసెనే ప్రియుని యింటికి జేరగ ప్రొద్దు క్రుంకగా
బాసట అందుకౌ త్వర - త్రపారహితంబుగ నేగుచున్నదే
ఆ సెలయేటి మానసము నందలి కోర్కెల నూహ సేయుమా!”

“హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీపాలావతంసోన్నత
ప్రాసాద ప్రమదావనాంతలతికా వాల్లభ్యపుష్పాళిలో
నీ సమ్మోహన ముగ్ధరూప సుమమో నీరేజపత్రేక్షణా!!”


వావిలాల వారి అలంకార సౌభాగ్యాన్ని ఔపమ్యరమ్యమైన ఈ క్రింది పద్యం వ్యక్తీకరిస్తుంది.


"కనకపు కంబ మొండు స్ఫటికంపు సురమ్య విశాలహర్మ్యమం
దున లగియించి నట్టులుగ తోచెడి శర్వుడు యోగశక్తిచే
ననుచగ నాత్మతేజము మహోన్నత దేహమునందు మున్ను నే
ననుకొన నీశు డర్యమ సహస్ర కళాకలితుం డటం చెదన్.”


ఒయ్యారాన్ని ఒలకబోసే ఈ ఎత్తుగడలు చిత్తగించండి...

అ) ఎన్నడులేని యీ యొదుగు లెచ్చట నేర్చినదీ పికంబు?
ఆ) ఈడుకు తగ్గ చేష్ట లగునే వ్రజభామినులార!
ఇ) కాకులమూక లోకము ప్రకారము వింతయె
ఈ) కాళులు లేక చిక్కితిమె కాలవశంబున చిక్కినాము.
ఉ) అవును నిజమ్మె కుంతి కనెన్నది నమ్మితి.
ఊ) నేనొక తేపగాగ నవనీపతి దాటదలంచె.

ఈ క్రింది పద్యాలలోని తెలుగు నుడికారాలు సుమనో మనోజ్ఞంగా ఉన్నవి.


'ఏగతి వచ్చి చేరితివి యింటికి వాకిట నిల్చియుంటి కా
దా గజదొంగ! మూసితివి అమ్మకు కన్నుల దొడ్డిగుమ్మమున్


శివాలోకనము

17