Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'నిరాశ '


ఉ.. జీవితనావ భగ్నమయి చిందరవందర గాగ జేతు వీ
     పావన మైన ఆశలకు పాదులు చేసి, జలమ్ము పోసి, ప్రే
     మావనిలోన నాటుము భయాకులవృత్తిని మాను మింక సం
     భావన చేయులే పెరిగి భర్తసుమ ప్రజపాలి నామనిన్.

శా. నాలో పెద్దతుపాను రేపి నగుచున్ గుర్తింతు వో తల్లి! నీ
    లీలాలోలత పాడుగాను! తగ దీరీతిన్ విజృంభింపగా
    జాలై పొంగెడు గాక నీ హృదయ సంసారమ్ము సంద్రమ్ముగా
    కాలాహంకృతి పచ్చి నెత్తురులలో కర్మమ్మె జీవింపగా?

ఉ. గండశిలాతి కర్కశము కాదు భవన్ముఖవీథి తల్లి. ఆ
    గుండె కదెట్లు వచ్చినదొ కొండలు పిండిగ చేయునట్టి ఆ
    ఖండలవజ్ర భీమ మగు కర్కశ సంపద? మారిపొమ్ము బ్ర
    హ్మాండము నెల్ల ముంపగల మా పెదతల్లిగ కృష్ణవేణిగా!

ఉ. ఇమ్ముగ హాసచంద్రికల నెక్కడొ దాన సుధారసమ్ము లే
    లెమ్మని నిద్ర లేపుము బలే! సొగసైన రసప్రవాహమై
    కమ్మనివాసనల్ విరియగమ్ముచు లోకము నిత్యనూతన
    త్వమ్మున వెల్గగా తలపు దాల్పుము నీవె రసాధిదేవివై! 4

'(ప్రతిభ, 1940)'


144

వావిలాల సోమయాజులు సాహిత్యం-1