Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'జీవయాత్ర '


తే. ఎవరి కని చెప్పుకోను నే నీ నిశీథిఁ
    బవలు మోసిన బరువులఁ బడిన బాధ
    సకియ, సెలయేర్లు లే - విక సకల మటులె
    చీకటిలొ మూగి గడుచునా జీవయాత్ర.

తే. ఎడఁద పరువెత్తు చెలియకై యేటి బాట
    యిచట నను నిల్పి పిల్పుల కెంత గొంతు
    జీరవోయిన వెనుకకుఁ జేరరాదు
    చేరినదొ లేదొ నా కేక యారిపోక.

తే. ఎచటఁ గనుపించు నా యెద కెంత వెట్టి
    ఇరుల పొలిమేర బాటలు నెఱిఁగి యెఱిఁగి
    యరిగినది గాని బేలయై యలసి సొలసి
    తిరుగుఁ గనుచూపు మేరలలో దెల్సిన నరసి.

తే. మునుపు సెలయేటి పాటలు మోసులెత్తు
    నూతనాయత శాఖికా నోక హములె
    నీడలే మేడలుగ మాకు నిండు రేలు
    నీటి పాటలఁ గలలుగా నలిగిపోయె.

తే. ఆమె యాషాఢ జలధరాయతన సీమ
   నొడలు పులకింప నటియించి యొరగి సోలి
   మేల్కొను మెరపుటన్నుల మిన్న గాని
   దీనుఁ డగు నన్ను మేల్కొల్పు తెరవ గాదు.

తే. స్వాగతోన్ముక్త గీతా స్రవంతి కలుగ
   నపుడు ననుఁ బిల్చె నీ మది యలల గములు
   ప్రణయరస మధువాహినీ బంధురములు
   సైకతముల నేని కనఁగఁ జనఁగ నీవు. 6

'(భారతి, 1941)'


మధుప్రప

139