పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

23

విశ్వామిత్రుని ప్రేరణచే వసిష్ఠుఁడు శ్రీరామునకుఁ దత్త్వము నుపదేశించుట


'రామాభిరామ! యో-రఘువంశసోమ!
ప్రేమఁ గౌశికుఁడు చె-ప్పినవాక్యములను
తగ వింటి, వేనునుఁ-దదనుసారముగ
విగతసంశయముగా-వినిపింతు వినుము!
సారవిహీనసం-సారంబు నందు
పౌరుషంబునఁ బొందఁ-బడును సర్వంబు,
విరివిఁ బౌరుషమే ద్వి-విధముగా నుండు
సరవి నుచ్ఛాస్త్రంబు,-శాస్త్రితం బనఁగ,
నందెన్న శాస్త్రిత-మర్థసంప్రాప్తి
నొందఁ జేయుచునుండు,-నుచ్ఛాస్త్ర మనెడి460
గురుపౌరుషంబు మి-క్కుటము తా నగుచుఁ
బరమార్థసౌఖ్యసం-ప్రాప్తి నొందించు;
వదలకుండెడి పూర్వ-వాసనచేతఁ
బదపడి శాస్త్రిత-పౌరుషం బొనర
జనియించి నప్పుడీ-జగతి నుచ్ఛాస్త్ర
ఘనపౌరుషంబుచే-గ్రక్కున దాని
నారూఢయుక్తిచే నడ్డ పెట్టుచును
ధీరతఁ జిత్తశాం-తినిఁ బొందు మనఘ!
అనభిజ్ఞచిత్తుఁడై-నటువంటివాఁడు
తనియక యజ్ఞాన-తప్తుఁడై యుండు;470