పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

5

ముక్తిఁ బొందఁగ లేరు;- ముక్తి యెట్లనిన
యుక్తితో వినుము చే-యుచునుండు కర్మ
వాసవావాసమై - వచ్చుచు లేని
యాసల కాస్పదం-బైన పాపంబు
క్షీణించిపోవుటే - చిరముక్తి యనఁగ,
నాణెమై తగు వాస-నలు నెట్టి వనిన80
సరవిని మలిన వా-సన, యదిగాక
సరసమౌ శుద్ధవా-సనయు నీరెండు;
అందు మలినవాస-నాజ్ఞానతమము
పొందుగాఁ దా నహం- బు వహించి, జన్మ
కారిణియగుచు దుః-ఖము నిచ్చుచుండు,
సారమై శుద్ధవా-సన పునర్జన్మ
కారిణిగా కహం-కార భీజంబు
[1]వారూఢిగాఁ గాల్చి - యానంద మిచ్చుఁ;
దానర్ధదేహంబు - ధరియించియుండుఁ
గానం 'దద్జ్ఞ' యనంగఁ - గరమొప్పుచుండు.90
ఘనశుద్ధవాసనా-కలితులు ధరణి
ననఘ! జీవన్ముక్తు- లనఁగ నొప్పుదురు;
అందు జీవన్ముక్తుఁ - డగు పంక్తిరథుని
నందనుకథ విన్న-నరులకు జన్మ,
మరణ దుఃఖంబులు - మాయు; నా రాము
చరితంబుఁ జెప్పెదఁ - జక్కఁగా వినుము!'

  1. నారూఢిఁ గాల్సిన యానంద మిచ్చు-వా.