పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

వాసిష్ఠరామాయణము

కథోపక్రమము


మున్ను భరద్వాజ - ముని పుంగవుండు
మోక్షేచ్ఛ నిజచిత్త-మునఁ బ్రకాశింప
[1]నక్షీణభక్తినిఁ - బ్రియము రెట్టింప
వరవిరక్తినిఁ బొంది - వాల్మీకిమౌని
చరణాంబుజములకుఁ - జాఁగిలి మ్రొక్కి,20
వినుతులు పెక్కు గా-వించి యిట్లనియె:

భరద్వాజుని ప్రశ్న


'ఘనమునీశ్వర! మీరు - కరుణించి నాకు
వేదశాస్త్రాది స-ద్విద్య లన్నియును
భేదంబు లేకుండ - చెప్పి ప్రోచితిరి:
మనుజులు సంసార-మాయాబ్ది దాఁటి
సునిశిత ముక్తి హె-చ్చుగఁ బొందు సరణి,
దెలుపవే!' యనుచుఁ బ్రా-ర్థింప, వాల్మీకి
యల భరద్వాజున - కపు డిట్టు లనియె:

వాల్మీకి వాత్సల్య వాక్కులు


'వత్స! భరద్వాజ! - వసుధ నందఱిని
వాత్సల్యమునఁ బ్రోచు - వైపు భావించి30
యతిరహస్యప్రశ్న - మడిగితి వార్య
[2]హితమొప్పఁ జెప్పెద - నెట్లన్న వినుము!

  1. వేక్షణ భక్తిని - వా.
  2. హిత మతిఁ జెప్పెద - వేం.