పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

292

వాసిష్ఠరామాయణము

పలికె ని ట్లనుచు 'నో- భామాలలామ
పెలుచ నీ విపుడు చె-ప్పిన మాట లన్ని 2110

సత్యమౌ, వేదాంత - శాస్త్రార్థములను
నిత్యంబు నన్ను మ-న్నించి బోధించి,

వదలని నా కర్మ - వాసన నణఁచి,
చెదరని సుజ్ఞాన - సిద్ధిఁ బుట్టించి,

చెప్పి చూపఁగరాని - చిద్బ్రహ్మమందుఁ
దెప్పున నన్నుఁ బొం - దించితి వీవు.

కావున నిపుడు ని-ష్కర్షగాఁ జూడ,
నీవె నా గురుడఁవు - నీకె మ్రొక్కెదను:

అన విని చూడాల - యమ్మహీపతికి
మనము రంజిలఁ జెప్పి, - మరల నాఘనుని 2120

నిజపురిఁ జేర్చె: నా-నృపకులోత్తముఁడు
సుజనులు మెచ్చఁగాఁ - జూడాల, తాను

వదలక యమల జీ-వన్ముక్తు లగుచుఁ
బదివేలయేండ్లు భూ-పాలనఁ జేసి,

మొనసి యంత విదేహ - ముక్తినిఁ బొంది'
రనుచుఁ జూడాల వృ-త్తాంత మంతయును

జెప్పి, వసిష్ఠుండు - శ్రీరాముఁ జూచి
'యప్ప ! చిత్తత్యాగ - మైనదే శుభము,

ఎవరికైనను ధాత్రి - నిది నిక్క' మనుచు
నవిరళకరుణతో- - నా వసిష్ఠుండు 2130

ఘనమైన చూడాల - కథ రఘూత్తమున
కనువుగా బోధించె - ననుచు వాల్మీకి