పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

వాసిష్ఠరామాయణము

వరరాజ్యమును వీడి - వచ్చు నీతోడ
వెఱవ కజ్ఞానంబు - వెంటనే వచ్చి,

జవనాథ ! కర్మవా-సన యనుఖాత
మున నిన్నుఁ బడఁ ద్రోసె-మోసంబు చేసి, 1600

పరఁగ నోదంబుపైఁ బఱచిన లతలు
దొరకను నీ తపో-దుఃఖంబు లగును,

అల కరిపరివార-మనుమానములును
వెలసిన నీమనో-వృత్తులే, మఱియుఁ

గరి కూలఁగాఁ బైనఁ గప్పిన దుమ్ము
నరయ నీకర్మ మో-హాంధకారంబు,

చలచిత్త! నీవిట్టి-సామజేంద్రంబు
చెలువున నూరకే- చెడితి వటంచు

నాగజోపాఖ్యాన-మా శిఖిధ్వజున
కా గుణశాలియై-నట్టి చూడాల 1610

పురుషాభిమానియౌ- భూపాలకునకుఁ
దరుణియై తాఁదెల్పు - తత్త్వార్థమందు

గుఱిని నిల్వఁ డటంచుఁ -గుంభాభిధాన
పురుషుఁడై జ్ఞాన మొ-ప్పఁగఁ జెప్పెననుచు

ముని రామునకుఁ జెప్పి-మోహం బడంచి,
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె:

'వినురామ! యెంతటి-విద్వాంసుఁడైనఁ
దనియఁ దనంతనే- తత్త్వశాస్త్రములు

చదివి తపం బెంత-సల్పినఁగాని,
మది సంశయంబులు-మానవు, చిత్త 1620