పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధప్రకరణము

257

జెలఁగి దర్భలు, నార - చీరలు, జడలు,
పొలుచు రుద్రాక్షలు - భూతి ధరించి,

యొసరఁ గమండల-మును, జపమాల
యును, బూలపుట్టిక-యును, మృదువైన

హరిణాజినము, దృఢం-బగు నాగబెత్త,
మురుపాదుకలు గల్గి యుండఁగా నతఁడు

చిరనిష్ఠచే బద్ద - సిద్ధాసనమున
నిరవొందఁ గూర్చుండి - యెండ వానలకుఁ 1280

దాను చలింపక - ధైర్యగుణంబు
నూని తపముఁ జేయు -చుండి నా నృపుఁడు.

ఇచట చూడాల తా-నెల్ల రాజ్యంబు
ప్రచురశక్తినిఁ బరి-పాలింపుచుండి

అష్టాదశాబ్దంబు - లరిగిన మీఁద
శిష్ఠుఁడై తప మొప్పఁ - జేయు నాయకుని

నిష్టంబుగాఁ జూడ - నిచ్ఛఁ జింతించి
యష్టసిద్ధులు తన - కబ్బియున్నందు

వలన నాథునిమీఁది - వాంఛతో లేచి
కలకంఠి గగనమా-ర్గంబున నరిగి, 1290

తపముఁ జేసెడి శిఖి-ధ్వజుని వీక్షించి.
యపరిమితార్తి ని- ట్లని మది నెంచె.

'అజ్ఞానమున నీతఁ -డానంద మిచ్చు.
విజ్ఞాన మెఱుఁగక - వెఱ్ఱి చందమున

వరరత్న భూషణా-వళిఁ దాల్చువాఁడు
తఱచు రుద్రాక్షలు - ధరియించినాఁడు,