పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిప్రకరణము

79

సరవి నెన్నఁగ నస - త్సంకల్పములను
మఱచి, సత్సంకల్ప - మతి నొందు మీవు,

అతిబాల్య కాలంబు - నందు విజ్ఞాన
రతుఁడవై గాఢ వై-రాగ్య మొందితివి; 1750

కనుక బద్దుండవు - గావు, బద్ధుండ
నని చింతఁ జేతురే?- యర్కకులేశ!

సరస మనో విలాసము బంధమగును;
మెఱయఁ దన్నిరసన - మే ముక్తి యగును.

లలినిఁ దన్మాన సో - ల్లాసవైభవము
వలన గోష్పదమంత - వసుధ యోజనము

కరణిఁ దోఁచును, క్షణ కాలంబుఁ జూడఁ
బరువడి బ్రహ్మ క-ల్పం బగుచుండు;

నొక నిదర్శన మిందు - కూహించి నీకుఁ
బ్రకటించి చెప్పెద - భావించి వినుము: 1760

లవణ శాంబరికోపాఖ్యానము



అవని మహోన్నతం - బగు పురమందు
లవణుం డనెడు రాజు - లలి నొక్కనాఁడు

చదురునఁ గొలువున్న - సమయమం దతని
కెదుట నిల్వంబడి - యింద్రజాలికుఁడు

మాయలఁ బన్నుచున్ - మంత్రింప, సభ్యు
లాయెడ మోహితు-లై చూడఁగాను

నొనరఁగా రెండు ము-హూర్తముల్ రాజు
కను మూసి నిద్రించి - కలఁగాంచి లేచి