76
వరవిక్రయము
పేర :- ఇది గడ్డురోజు! ఈ రోజు గడిచిందంటే యిక భయమే లేదు. లింగరాజుగారు సంచులు కోసి సంభావనలిస్తారని పై వూళ్లనించి కూడా బ్రాహ్మలు కూడా వచ్చిరట. ఆయనేమో, పోలీసువార్ని అరంజిమెంటు చేస్తున్నారట, విన్నారా?
వీర :- (ప్రవేశించి) అయ్యా! ఫలహారాల కావిళ్ళింకా పంపించినారే కారు. పెళ్ళివా రెంతసేపు ఆగుతారు? ఎవరిమటుకు వాళ్ళు కాఫీ హోటళ్ళకు ప్రయాణమవుతుంటే, పరుగు పరుగున నేను చక్కా వచ్చాను. మగ పెండ్లి వారినిలా చూస్తే మర్యాద దక్కుతుందా?
పురు :- ఇదుగో యిప్పుడే పంపెద. ఈపాటికి సిద్ధమయ్యుండును.
వీర :- ఏమి కావడమో. నిన్నటి వుప్మాలో నిమ్మపండ్ల రసమే లేదట. ఇడ్డెన్లలో అల్లము ముక్కలు లేవట. కాఫీలో పంచదారలేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త ఎక్కువగా పంపండి. చుట్టలు, సిగరెట్లు, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్ల పేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈ పూటింకోనాలుగెక్కువ పంపండి. మదరాసు నశ్యము మాట మరిచిపోకండి. శలవు. మఱి యాలస్యమైతే మాటదక్కదు. (అని నిష్క్రమించును.)
పురు :- ఏమి నిరంకుశాధికారము! ఏమి మిలటరీ ఫోర్సు! మగపెండ్లి వారన మరిడీ దేవతలు కారుగదా. (అనుచు లోనికేగును.)
పేర :- ఎనిమిది వేలకూ, యేభయ్యో, వందో వుంటాయి. ఇంతవరకూ నాచేతిలో పైసా పడలేదు. యిప్పుడే నాది నేను వడుక్కోవాలి కాని, ఆనక వీరిచ్చేదేమిటి చచ్చేదేమిటి. ఆనక వీరి కన్నముంటెగద. ఈరోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేశాక, యింకా వుండే దేమిటి, వుద్ధరి! తొలినా డడావడి, మలీనా డాయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగవు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగుట మటమా; పదిహేను వేలము; పదహారు చిప్ప. ఈ రోజుల్లో యిదే పదహారురోజుల పండుగ. కాబట్టి, వెళ్ళీ కదిపి చూస్తాను. (నిష్క్రమించును)