పుట:Varavikrayamu -1921.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము

77


మూడవ రంగము

(ప్రదేశము: పురుషోత్తమరావుగారి భోజనముల పందిరి.)

పురు :- ఇప్పుడు రెండు గంటలైనది. ఇంతవర కొక్కరునూ రాలేదు. వంటలు చల్లారిపోవుచున్నవి. వంటవారు కస్సుమనుచున్నారు.

సీ. పిలిచిన బలుకక బిగఁదన్నుకొని లోన
        ముసుఁగుఁ పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకఁడు
    ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని
        చుట్ట ముట్టించెడు శుంఠ యొకఁడు
    ఒగిఁ దనకై వేచి యుంద్రో లేదో చూత
        మని జాగుసల్పెడి యల్పుఁడొకఁడు
    ముందువచ్చినఁ బర్వు ముక్కలౌ ననుకొని
        కడను రాఁజూచు ముష్కరుఁ డొకండు

    కుడిచి యింటను హాయిగా గూరుచుండి
    వత్తురానని చెప్పని వాజెయొకఁడు
    వచ్చి కోపించిపోవు నిర్భాగ్యు డొకఁడు
    ఆఱు వేల్వారి నిందుల - తీరు లివ్వి.

పేర :- (వగర్చుచుఁ బ్రవేశించి) బాబూ! యీ పూట నామచ్చ మాసింది. తిరిగి తిరిగి కాళ్ళు విరిగాయి. (అని కూలఁబడును.)

పురు :- ఏమన్నారు? పెండ్లి వారెవరైన వచ్చుచున్నట్లా?

పేర :- ఏం పెళ్ళివారు! ఏం రావటం? పోలీసు వారిచేత పొడిపించినందుకు బయటకువస్తే బ్రాహ్మణులు చంపేస్తారని, ఈపూట లింగరాజు గారింటిలోనే అత్తీసరు వేయించుకుని ఆరగించారు.

పురు :- కడమవారు?

పేర :- ఇదిగో వస్తున్నా. లింగరాజుగారి మొదటిభార్య మేనమామ బావమరిది తోడల్లుడు తమ్ముడట, ఆయనకీ పూట యిడ్డెన్లలో అల్లం ముక్కలు తక్కువైనాయట, అందుకోసం అలిగి కూర్చున్నాడు. పెళ్ళికొడుకు జనక సంబంధము బాపతు పినతండ్రిగారి సవతితల్లి తమ్ముడు బావమరిదికి వేలువిడిచిన మేనమామ కొడుకట. ఆయనకు రాత్రి చిన్న