పుట:Varavikrayamu -1921.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

వరవిక్రయము

లింగ :- బాబూ! కానీకిఁ గలము వచ్చుచుండఁగా ఫవుంటెను పెన్ను యెందులకు పనిలేక? అంతగా మనసైనచో అలుక పాన్పుమీఁద అన్నిటితోపాటు ఫవుంటెను పెన్నుగూడ నత్తవారినడిగి పుచ్చుకొనవచ్చును. గాని బండివానికేదో చెప్పి పంపివేయుడు.

బస :- అదిమాత్రము నావల్ల గాదు! (అని నిష్క్రమించును.)

లింగ :- ఆ వన్నెల విసనకర్ర సంగతి యీ విధముగా నున్నది. యీ పాడుకట్టె సంగతి యీవిధముగా నున్నది! పాడు టీచర్లు కుఱ్ఱవాండ్రను పాడుచేయుచున్నారు! పయిగా కలము క్రిందను, కాగితముల క్రిందను ఖర్చుపడుచున్న డబ్బునకు లెక్కయే లేదు! కనుకనే గాంధీమహాత్ముఁడు చదువులకు స్వస్తి చెప్పింపుమన్నాడు. వివాహమగువఱకును వీనిని మాన్పించుటకు వీలులేక చూచుచున్నాను. ఇదేమి ప్రారబ్ధమో యీ దినములలో కాలేజికి వెళ్ళుచున్న వానికిగాని కట్నములబిగువు లేకున్నది! ఈ కసుగాయ కుంకను కట్నములకొఱకు గాకఁగతుల కొఱకుఁ బెంచుచున్నానా! నా మొదటిపెండ్లికి రెండువేలుఁ, రెండవపెండ్లికి నాల్గువేలు, మూడవ పెండ్లి కెనిమిదివేలు మొత్తము పదునాలుగువేలు వచ్చినవి. ఈ కుంకకుఁ గూడ నిదేవిధముగా వచ్చునని యాశ. ఇదేమి పాపమో ఇంతవఱకు వేయి, రెండువేలు ఇచ్చెదమనెడివారే కాని పట్టుమని పదివేలీయఁగలవా రగపడలేదు! నియోగ మంతకంతకు నిర్భాగ్య యోగమయి పోవుచున్నది! ఎవరు చెపుమా వచ్చుచున్నది! చవటకుంక, తలుపుతీసి చక్కబోయినాఁడు కావలయును! బండివాడో పరదేశ బ్రాహ్మణుడో యైయుండును! కానిమ్ము గది తలుపుమూసి, యేమియు నెత్తుకొనిపోకుండ, కంతలగుండాఁ గనిపెట్టెదను. (అని లేచును.)

పేర :- (అంతలో బ్రవేశించి) మహదైశ్వర్యాభివృద్ధిరస్తు! మనోవాంఛాఫల సిద్ధిరస్తు! రాజ ద్వారే, రాజ భవనే, రాజ సభే, రాజ సమీపే, సర్వదా దిగ్విజయమస్తు!

లింగ :- ఏమీ! పేరయ్యయే! ఏదో పనిమీద వచ్చినట్లున్నారే?

పేర :- ప్రభువుల వద్దకు పనిలేన్దే రాగలమా?