Jump to content

పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

56

     చక్రము గ్రక్కదలన్ బడె, శక్రశతారచ్ఛితోగ్ర శైలము లీలన్ . 80

శా. ఈలీల హరి మాలిఁ ద్రుంచుటయు దేవేంద్రాదిది క్పాలకుల్
     చాలన్ సంతస మంది దివ్యసుమవర్షంబుల్ ప్రవర్తించి ర
     వ్వేళన్ వానివిధంబుఁ గన్ను లెదుటన్ వీక్షించి శోకానల
     జ్వాలల్ గ్రాలఁ దదగ్రజుల్ వగచుచున్ సైన్యంబుతోఁ బాఱఁగన్ . 81

శా. లంకామార్గము వట్టినట్టిరిపుల లక్షించి తర్క్ష్యుండు సా
     హంకార స్థితి వెంబడిన్ బడి స్వపక్షాభీలవాతంబు న
     ల్వంకల్ దార్కొనఁ జేయఁ దూలములలీలన్ వార లుద్విగ్ను లై
     బింకం బేది చనంగఁ గేశవుఁడు గంభీరాట్టహాసంబునన్. 82

మహాస్రగ్ధర. బెదరించున్ బెట్టుమించున్ బెనుశరములచే భీకరస్పూర్తి ముంచున్
     గుదియించున్ గోపగించున్ గురుముసలములన్ గొట్టి బాధించు వంచున్
     గదనొంచున్ గండడంచున్ ఘనపరిఘములన్ ఖడ్గమున్ గైధరించున్
     విదళించున్ వెంబడించున్ విసువ కసురులన్ విష్ణుఁడీరీతిఁద్రుంచున్. 83

వ. అప్పుడు. 84

మ. జహదస్త్రంబు లుఠత్తురంగముఁ బతచ్ఛత్త్రధ్వజంబున్ క్షిప
     ద్బహుశీర్షంబు నటత్కబంధము గళద్రక్తంబు ధావద్భటం
     బుహసద్భూతము విస్రవచ్ఛ్రమపయఃపూరంబు నై యిందిరా
     గృహిచే శత్రుబలంబు పెంపు సెడి పాఱెన్ దక్షిణాశాగతిన్ . 85

క. హరివెనువెంటన్ దగిలిన,కరినివహముచందమునఁ గకావిక లగుచున్
    హారి వెనుతగిలిసఁ బఱచిరి, కరినివహాముతోడ రివులు కాకుత్స్థమణీ. 86

తే. ప్రళయఝంఝా సమీరంబువలనఁ జెదరి
    పఱచు కాలాభ్రములలీలఁ బద్మనాభ
    శార్ఙ్గకోదండ నిర్ముక్తసాయకోగ్ర
    పవనహతి దైత్యసంఘముల్ పఱచె నపుడు 87

చ. గరుడతురంగనందకవిఖండితదానవరాట్తనుచ్యతా
    భరణరుచుల్ దిగంతములఁ బర్వె ఘనాఘనకోటినుండి భా
    సురగతి మించుమించు లన క్షోణిపయిన్ హరి కుంకుమాంబువుల్
    గురియు తెఱంగునం దొఱఁగెఁ గ్రొత్తగ నెత్తురుటేఱులత్తఱిన్. 88

మ. ఘనదైతేయఘనాఘనప్రచయ మాకాశంబునం దాజనా
      ర్దనపర్జన్యనియుక్తిఁ జెంది రణవర్షావేళ వర్షించె నూ
      తనకీలాలము హారమౌక్తిక లసద్వర్షోపలవ్యాప్తి భూ
      తనికాయం బనుచాతక ప్రతతి కుత్సాహంబుఁ గల్పింపుచున్ 89
వ. ఈ క్రమంబున. 90