తృతీయాశ్వాసము
97
దనుమతి యిచ్చితిన్ జను ప్రియం బగుచోటికి నీభుజాబలం
బనితరసాధ్య మంచు విని యారయ నిల్పితి నింతె యియ్యెడన్. 93
తే. మత్పదాంగుష్ఠపరిపీడ్యమానరజత, పర్వతము క్రిందఁ జేతులు పడినయపుడు
జగము లద్రువ విరావంబు సలిపి తందు, వలన రావణుఁడను పేర వెలయు మనిన.
ఉ. ఆదశకంఠుఁ డీశ్వరున కానతుఁ డై శివ నన్నుఁ బ్రోవ నా
హ్లాదము గల్గెనేని నిసుమంతకొఱంతయు లేనియాయువున్
నీ దగుచంద్రహాసమును నెమ్మి నొసంగు మటన్న శంభుఁ డ
క్కైదువు నిచ్చి పిమ్మట నఖండతరాయువు నిచ్చి యి ట్లనున్. 95
మ. దితిజాధీశ్వర నీవు గోరిన క్రియన్ దీర్ఘాయువున్ నీకు ని
చ్చితి నీ క్రొవ్వున నీతిఁ జేకొనక దుశ్శీలుండవై మ మ్మనా
దృతినొందించితి వేని మావరము మమ్మే చేరుఁ బొమ్మన్నచో
నతఁ డాశూలికి మ్రొక్కి వీడ్కొని విమానారూఢుడై యుబ్బుచున్ . 96
క. తనపరివారము గొల్వఁగఁ, జనియెన్ రజతాద్రి డిగ్గి స్వచ్ఛందగతిన్
మనుజేశ్వర యని కుంభజుఁ, డినకులునకుఁ దెల్పి మఱియు ని ట్లని పలికెన్. 97
§§§ రావణుని చర్యలు §§§
మ. ఇనవంశోత్తమ వింటె పంక్తివదనుం డీలాగు కైలాసవా
సునిచే మన్ననఁ గాంచి పొంగుచుఁ బ్రహస్తుండాది యౌ సైనికుల్
దనుఁ గొల్వన్ జని హేమకూటహిమవత్ప్రాంతంబులన్ గంధమా
దననీలాచలపారియాత్రములమీఁదన్ గ్రీడ సల్పెన్ రహిన్. 98
వ. మఱియును. 99
సీ. చరియించు నొకవేళఁ జంబూనదీతీరసౌవర్ణవాలుకాస్థలములందు
విహరించు నొకపూట వేల్పురాతోఁటల బొదలుగొజ్జెగపూవుఁబొదలయందుఁ
గ్రీడించు నొకతఱిఁ గేసరశ్వేతాంజనాద్యద్రిరాడధిత్యకలయందు
నలరు నొక్కెడఁ గేళి నరుణోదమానసప్రముఖదివ్యసరోవరములయందు
తే. నన్నెలవులందు మెలఁగెడునమరఖచర, యక్షకిన్నరసిద్ధవిద్యాధరాప్స
రోభుజంగాదికులు మహాక్షోభ మొంది, తన్నుఁ గనుఁగొని పాఱ నద్దశముఖుండు.
సీ. పట్టణం బన రాదు కట్టాయితంబు గా నట్టె ముట్టడి చేసి చుట్టు విడియు
బలవంతుఁ డనరాదు బలియుఁ డై యెంతదవ్వుల నున్న వడి నేఁగి గెలిచి వచ్చు
సురజాతి యన రాదు కర మల్గి యెట్టు సన్నఁ జననీక శస్త్రాస్త్రసమితి నొంచు
ధరణీశుఁ డన రాదు తనకు నోడితి నన్నదాఁక నీరసమున వీఁకఁ జూపుఁ
తే. బాయవునెలంత యనరాదు పాపమునకు, భయపడక యెట్టులైనను బట్టికలయు
నర్హవస్తువులటఁ గల వనఁగరాదు, దుడుకుమైఁ జొచ్చి కొనితెచ్చు దుష్టుఁ డతఁడు.