Jump to content

పుట:Urvi Suta Udvahamu By Ikkurti Tirupati Raya (Telugu, 1923).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

సదయ హృదయులగు నో మహాజనులారా !

చిన్న మనవి__

విద్యాంగలక్షణ గ్రంధములే నెక్కువగాఁ బరిశీలింపకున్నను, అస్మద్గురువర్యు లగు బ్రహ్మశ్రీ చిల్లర వేంకటేశ్వర కవిగారి విద్యావర ప్రసాదము వలన నించుక కవితాధోరణీమాత్రము నాకీయల్ప ప్ర్రాయంబుననే సంప్ర్రాప్తమైయుండెను. మండవిల్లిగ్రామ వాస్తవ్యులును, మాతృభాషాభిమానులును, మత్ప్రియ పుత్రులును నగు మ॥ రా॥ శ్రీ అద్దేపల్లి సత్యనారాయణగారు శ్రీ మత్సకలోద్భవస్థితిలయకారణభూతుండును, భక్తజన సులభుండును, బరమాత్ముఁడును, బరమేశ్వరుండు నగు శ్రీమన్నారాయణు లీలావతారంబులలో శ్రీ రామావతారముం గూర్చి కౌశికుండు దశరధుని కొలువుకూటంబున కరుదెంచి శ్రీరామలక్ష్మణుల యజ్ఞరక్షణార్థము పంపుఁడని వేడుట మొదలు దైత్యదండనమును, దీక్షారక్షణమును, అహల్యా శాపవిమోచనంబును, హరచాపఖండినంబును, గావించి శ్రీ రామచంద్రుఁడు సీతాసతీరత్నమును బరిణయమై యటనుండి మరలి వచ్చునప్పుడు పరశురాముని గర్వభంగంబు గావించి పురప్రవేశ మగువరకు నాటక రూపముగా వాయుఁడనియు, నచ్చొత్తించుటకు వలసిన ద్రవ్యసహాయము నేఁ జేతుననియుఁ జెప్పి నన్నీ కార్య నిర్వహణమునకుం బురికొల్పుటచే నా యల్పజ్ఞతనైనను విచారింపక నా మిత్రుని పలుకు లంగీకరించి యేతద్రచనా విధానమునకుం గడంగి యత్యల్ప కాలములో నియ్యది పరిసమాప్తి చెందించి నా మిత్రుని సఫలీకృత మనోరధునిఁ గావించి తన్మన్న నలకుఁ బాతుఁడనైనందులకే నెంతయు ధన్యుఁడను.