Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ యధ్యాయము

81


వలెఁ బ్రౌఢముగా లేకపోవుటచేతనే సర్వత్రవ్యాపింపకున్నదట. అట్లయినయెడల నత్యుత్తమకావ్యము లనియాంధ్రకవిచరిత్రకారునిచేఁ బొగడ్తలు గాంచినయుత్తరహరివంశాది కావ్యములు సర్వత్ర వ్యాపింప కుండుటకుఁ గారణమేమి? పంచమవేద మని పూజింపఁ బడెడు భారతమునకుఁ గలవ్యాప్తి యీనిర్వచనకావ్యమునకే గాదు మఱి యేకావ్యమునకును రాదు. మనయాంధ్రదేశములో భారత భాగవతరామాయణములకుఁ గలవ్యాప్తి యేయుత్తమకావ్యములకుఁ గలదు? కవితారచనమునకు నేనియమములను విధించెనో యానియమములను బాటించియే తిక్కన తననిర్వచనోత్తరరామాయణమును బ్రౌఢముగా రచించి వాసికెక్కినాఁడు. అందువలననే దీనిని రచించిన స్వల్పకాలములోపలనే యాంధ్రప్రపంచమునఁ గవితాసామ్రాజ్య పీఠము నథిష్టించి జగత్పూజ్యుఁ డయ్యెను. ఈనిర్వచనోత్తరరామాయణము రంచిచునాటికిఁ దిక్కన శివభక్తి పరాయణుఁడై యుండెను గాని తరువాత యద్వైతవాది యై యభేద వాదమును బోషించెను.