పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తుపాను

ప్రస్తావన

1

పూర్వకాలం నాల్గింటికి ప్రణయతత్వం ఏమితెలుసునా అని నా అనుమానం. ఏమీ తెలియదని నా దృడ నమ్మకం. పూర్వనాయికలు ప్రేమించారు. నాయకులకై విరహవేదన పడినారు. మదనజ్వర తాపోపచారాలు చేయించుకున్నారు. లేత అరిటాకు వీననలు, చిగురుటాకు పాన్పులు. ఆ మన్మథాకారుని చూడలేని కళ్ళు గాజుకళ్ళు అనుకున్నారు.అలాగే ఏమేమో కాంక్షలతో కుంగిపోయేవారు. వాళ్ళ ప్రేమ రైలు పట్టా ప్రేమ. ఒక మనిషిని ప్రేమించడం అంటే వాడితో దాంపత్యధర్మం అనుభవించాలన్న మాటేనా? తక్కిన వాళ్ళంతా అన్నలూ, తమ్ములూనా? అంతే ! కానీ యీ రోజుల్లో నాబోటి యువతులకు ' విచిత్ర భావ సంకీర్ణత' ఉన్నది. ఆనాటి యువతీ చరిత్రలో మానాటి యువతీ చరిత్ర ఒక అధ్యాయం కాలేదు. నాబోటి చదువుకున్న, నవయవ్వనంలో ఉన్న యువతులు కొందరం కలసి మా భాషలో ప్రేమ తత్వాన్ని తెలియజేసే పదం ఏమన్నా ఉందా అని ఆలోచించాము. పూర్వకాలములో స్త్రీలకు పురుషులకు ఉండే సంభందం రస స్వరూపంలో ఆలోచించారుగాని మానవజాతిలోని ఒక పెద్ద సమస్యగా ఆలోచించలేదు. ప్రేమ, ప్రణయం అనే పదాలలో ప్రణయానికి ప్రళయానికి ధ్వని సంభందం కనపడడంచేత, 'ప్రణయం' అనే మాటే బాగుందని అది ఏరుకున్నాం. ప్రేమ అనే పదం ' తేమ' అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని తోసేశాము. ప్రణయానికి మేము చెప్పుకొన్న అర్ధం అపారం, అద్బుతం, అంత్యంత క్లిష్టం, అస్పష్టం, ఆశ్చర్యకరం.

                                                                                                       2

నా ప్రణయవస్త్రములోని అల్లిక జంటపోగులతో, మూడు పోగులతో, రంగు రంగుల మూలవాటపు దూప్ చాహన్ కలయికతో నిండి ఉన్నది. నేను నలుగురిని ప్రేమిస్తున్నా, కాదు ప్రణయిస్తున్నా ననుకోండి. శ్రావ్యమైన కంఠం కలిగినది ఒకరు, మంచి రూపం కలిగినది ఒకరు, మాటలపోగు ఒకరు, మౌనం, కలిగినది ఒకరు.