పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    త్యాగతి :పశువులకూ మెదడు వుంది కాని అది చిన్నది. మనుష్యుల మెదడంత క్లిష్టమైనదికాదు, సరే. మనుష్యుడూ తన బిడ్డల్ని ప్రేమిస్తాడు.జంతువులూ ప్రేమిస్తవి.ఆ రెంటి ప్రేమలో తేడా వుందా?

    సోఫీ :ఉండకేం ? జంతువు అవసరం ఉన్నంతసేపే, తర్వాత ప్రేమనే మరచిపోతుంది.

    త్యాగతి :కాని మనుష్యుడు జీవితం వున్న దాకా ఎందుకు ప్రేమిస్తాడు? చచ్చిపోయిన చుట్టాల్ని,స్నేహితుల్ని,గొప్పవారిని ఎందుకు ప్రేమిస్తాడు? దేశం అని ప్రాకులాడుతాడు,మానవలోకం అని గగ్గోలు పడతాడు. ఎందుకు సోఫీ?

                                                                                                                    20


    ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ ఉండే సంబందానికీ -మతానికీ ఏం చుట్టరికం ఉందీ? నైతికం అంటే ఏమిటి? కామపరమైన స్త్రీ పురుష సంబంధము నైతికంగా మానవుల్ని అధోగతిలో పడేస్తుందని ఎలా నమ్మగలము?

    ఈ ఆలోచనలు ఒంటిగా ఉన్నప్పుడల్లా నాకు వస్తూనే ఉన్నాయి.ఈ విషయాల గురించి నాతో సమానంగా ఆలోచిస్తుంటాడు తీర్ధమిత్రుడు.నైతికమనేది మానవులలో ఒకరి కొకరు కష్టం కలిగించకుండా ఉండటము.అందుకనే మనుష్యుణ్ణి మనుష్యుడు చంపడము తప్పైనా,వారూ వీరూ ఒప్పుకుంటే యుద్దంలో ఒకర్నొకరు చంపుకోవచ్చును.కాని అది దేశపరం కావాలి, అంతే.

    అలాగే స్త్రీ పురుష కామసంబంధము ఈ పక్షం ఆ పక్షం ఒప్పుకుంటే నీతిదూర మెట్లా అవుతుంది? పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకొని కదా భోజనానికి వెడుతున్నారు ?అల్లగే పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకుంటే, స్త్రీపురుష సమాగమం నీతిదూరం కాదనే నాకు తోస్తూ ఉంటుంది.

    ఈ విషయంలో నాకూ,త్యాగానికీ భేదాభిప్రాయాలున్నాయి.మా కల్పమూర్తి ఈ వాదన వచ్చేటప్పటికి చెవులు మూసుకుని పరుగెత్తాడు.ఈ వాదనలో సోఫీ నన్ను బలపరుస్తూనే ఉంటుంది. కాని ఆ బలపరచడం వట్టి వాదన కోసమేనని నా అనుమానం.లోకేశ్వరి మాత్రం తన అభిప్రాయ మేమిటో ఎప్పుడూ చెప్పదు.

    చదువుకోని భారతాంగనల్లో వివాహం ఐనా,స్త్రీ పురుష సంబంధము నైతికానికీ మోక్షానికీ,కొన్ని వేలకోట్ల యోజనాల దూరము ఉందని సాధారణాభిప్రాయం. మనోబలం కాస్త తక్కువగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలు మగవాడి మాయలకు లోబడి,ఎప్పుడైనా తమ దేహాల్ని వాళ్ళ కప్పచెప్పడం ఉన్నది. యివి సాదారణ కుటుంబాలలో అప్పుడప్పుడు జరిగే రహస్య సంఘటనలు. అవి లోకానికి కొంచెముగా తెలియవచ్చును.తెలియక పోవచ్చును. అనేక యుగాలనుంచి వచ్చింది కాబట్టి కాబోలు ఈ నైతిక ఆధ్యాత్మికాభిప్రాయం,నేను నాలో ఎంత వాదించుకున్నా నాకు తెలిసియున్నూ తెలియకుండాన్నూ కూడా నా చుట్టూ గోడలు కట్టుతూ ఉంటుంది.